Govt School Students Facing Problems: నాడు-నేడులో భాగంగా తమ పాఠశాల రూపురేఖలు మారిపోతాయని భావించిన ఆ పిల్లలకు, ఉపాధ్యాయులకు నిరాశే ఎదురవుతోంది. అదనపు భవనాలు నిర్మించేందుకు గుత్తేదారు కాంట్రాక్టు తీసుకున్నా.. పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు పాఠశాల నూతన భవన నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. మొదలు పెట్టిన భవనాలు పూర్తికాక.. ఇరుకు గదుల మధ్య చదవలేక విద్యార్థులు అల్లాడిపోతున్నారు. నాడు-నేడులో భాగంగా కంకిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల అదనపు భవనాల కోసం నిధులు సైతం మంజూరయ్యాయి. 11 నెలల క్రితమే పనులు మొదలైనా.. ఇప్పటికీ పూర్తికాలేదని స్థానికులు అంటున్నారు. కరోనా సాకు చూపించి, గుత్తేదారు కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేవలం 30 నుంచి 35 శాతం పనులు మాత్రమే పూర్తి చేసి చేతులు దులుపుకున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.
స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకుల అండదండలతోనే ఇలా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. భవన నిర్మాణానికి తెచ్చిన సామాగ్రిని నిర్లక్ష్యంగా వదిలేయటంతో విద్యార్థులు ఆడుకునే సమయంలో గాయాలకు గురవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.