Kalamkari Industry in Crisis: అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన పెడన కలంకారీ హస్తకళల పరిశ్రమ పాలకుల నిర్లక్ష్యం కారణంగా నేడు సంక్షోభం దిశగా పయనిస్తోంది. రసాయన రహిత రంగులతో చేతి పనితో రూపుదిద్దుకునే కలంకారీ వస్త్రాలు.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్ని ప్రతిబింబిస్తాయి.
గతంలో ఓ వెలుగు వెలిగిన ఈ పరిశ్రమ పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల.. ప్రస్తుతం కళ తప్పి వెలవెలబోతోంది. దీని కారణంగా కార్మికులు కలంకారీ పని వదలి ఇతర ఉపాధి అవకాశాలను వెతుక్కుంటున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో కలంకారి హస్తకళల పరిశ్రమలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఆధారపడి జీవిస్తున్నారు. అటువంటి పరిశ్రమను ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని కార్మికులు వాపోతున్నారు.
AP Jaggery Industry ఆ బెల్లం మాటలు ఏమైయ్యాయి..! మాట నిలుపుకోని జగన్.. సంక్షోభంలో బెల్లం పరిశ్రమ!
కలంకారీ పరిశ్రమను ప్రస్తుతం అనేక సమస్యలు చుట్టుముట్టాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా కలంకారీ పరిశ్రమల్లో వేతనాలు లభించకపోవడం, ఉత్పత్తి చేసిన వస్త్రాలకు మార్కెట్లో గిరాకీ లేకపోవడం, సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడం వల్ల.. ఈ వృత్తికి చాలామంది స్వస్తి చెబుతున్నారు.
సహజ సిద్ధంగా తయారు చేసే రంగులు.. ఎలాంటి రసాయనాలు వాడకుండా.. కూరగాయలు.. ఇతర పదార్ధాలతో విభిన్న రంగులు తయారు చేసి.. వస్త్రానికి అద్దుతుంటారు. చెట్ల వేర్లు, బెరడు, ఆకులు, పళ్లు, పువ్వులు, పాలు, పేడ వంటి వాటితో సహజ రంగులు తయారు చేస్తారు. ఇవి శరీరానికి ఏ మాత్రం హాని చెయ్యవు. ఆరోగ్యానికి మేలు చేసే విధంగా కరక్కాయ రసాన్ని వస్త్రానికి పెట్టడం, మార్కెట్లోకి వెళ్లేముందు మెరుగులు దిద్దుకునేందుకు క్యాలండరింగ్ యంత్రం, బాయిలింగ్.. చేస్తుంటారు.