ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్‌గా గుర్తింపు పొందిన మీడియాపై ప్రభుత్వ తీరు గొడ్డలిపెట్టులా మారిందంటూ.. తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై తన కలంతో పోరాడటమే మీడియా చేసిన నేరమా అని నిలదీశారు. సాక్షి పత్రిక, మీడియా ఛానెల్ మీద ప్రేమ... మిగిలిన పత్రికలు, ఛానెల్స్‌పై లేకపపోవటం దురదృష్టకరమని కళా అన్నారు. ప్రభుత్వ ప్రకటనల కోసం ఒక్క ఏడాదిలోనే సాక్షి పత్రికకు రూ.200 కోట్లు కేటాయించారని ఆరోపించారు.
ప్రకటనల జారీలో వివక్ష చూపటం పత్రికా స్వేచ్ఛను హరించటమే అవుతుందన్నారు. మీడియాకు పరిమితులు విధించటం అంటే ప్రజాస్వామ్యానికి హద్దులు గీయటమేనని కళా అన్నారు. ఏపీలో అధికార పక్షధోరణి శృతి మించిందని ఆరోపించారు. ప్రభుత్వం కక్షపూరిత విధానాలు అవలంబిస్తే.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న పాత్రికేయులను ఆదుకోవాలని కోరారు. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని డిమాండ్ చేశారు.