ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా...? - తెదేపా నేతల అరెస్టును ఖండించిన కళా వెంకట్రావు
కొల్లు రవీంద్ర అరెస్టు అప్రజాస్వామికమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. కొనకళ్ల, బచ్చుల అర్జునుడు గృహనిర్బంధాలు ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా అంటూ ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన తెదేపా నాయకులను భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అసంఘటిత కార్మికులకు మద్దతుగా ఇసుక కొరత నివారణ కోరుతూ మచిలీట్నంలో తెదేపా నేతలు చేపట్టిన నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేయడాన్ని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఖండించారు. తెదేపా నేతలను పోలీసులు అరెస్టు చేసి దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపించారు. కొల్లు రవీంద్ర అరెస్టు అప్రజాస్వామికమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన ఇసుక కృత్రిమ కొరతతో 30లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఆరోపించారు. వారికి అండగా నిరసన తెలియజేయడం తప్పా అంటూ కళా ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇసుక కొరత నిలువరించి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు సిద్ధమవుతామని కళా వెంకట్రావు హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేశారు. అరెస్ట్ చేసిన తెదేపా నాయకులను భేషరతుగా విడుదల చేయాలని కళా వెంకట్రావ్ డిమాండ్ చేశారు.