JP Company Not Paid Sand Arrears to APMDC: రాష్ట్రంలో అన్ని నిల్వకేంద్రాల్లో ఉన్న ఇసుక తీసుకొని గుత్తేదారు జేపీ పవర్‌వెంచర్స్ అమ్మేసుకుంది. తూకపు యంత్రాలు తదితరాలను వినియోగించుకుంటోంది. కానీ వీటికి 120 కోట్ల రూపాయలు అడిగితే రెండున్నరేళ్లుగా నోరెత్తడంలేదు. ముక్కుపిండి బకాయి రాబట్టాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఇసుక కాంట్రాక్టు నుంచి జేపీ సంస్థ త్వరలో వైదొలగనున్నట్లు తెలిసినా దాని జోలికి వెళ్లకుండా జగన్ ప్రభుత్వం ప్రత్యేకప్రేమ చూపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2021 మే నుంచి ఇసుక తవ్వకాలు, విక్రయాలను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి జేపీ సంస్థ తీసుకుంది.
Sand Arrears: అదే సమయంలో అన్ని నిల్వ కేంద్రాల్లో ఉన్న 14 లక్షల టన్నులఇసుకను జేపీ సంస్థకు అప్పగించారు. నిల్వకేంద్రాలు, రీచ్‌ల వద్ద ఏపీఎండీసీ గతంలో కొన్న 117 తూకపు యంత్రాలు, 1,300 వరకు సీసీ కెమెరాలు, మొబైల్ డివైజ్‌లు, బయోమెట్రిక్ డివైజ్‌లు, ప్రింటర్లు కూడా జేపీ సంస్థకు ఏపీఎండీసీ అప్పగించింది. వీటన్నింటి విలువ కలిపి 100 కోట్లు, ఇప్పటివరకు వడ్డీ రూ.20 కోట్లు అయింది. ఇందులో నయాపైసా కూడా ఏపీఎండీసీకి జేపీ సంస్థ చెల్లించలేదు.
Sand Mining:తొలుత జేపీ సంస్థ పేరిట ఇసుక విక్రయాలు ఆరంభమైన కొద్ది రోజులకే బకాయిలు ఇవ్వాలని ఏపీఎండీసీ కోరింది. నిల్వకేంద్రాల్లోని ఇసుక విక్రయించాక సొమ్ము చెల్లిస్తామని జేపీ సంస్థ మొదట్లో చెప్పింది. నెలలు, సంవత్సరాలు దాటిపోయాయి. ఇప్పటికి రెండున్నరేళ్లు అయినా ఆ సంస్థ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. బకాయిలు చెల్లించాలని ఏపీఎండీసీ ఇప్పటికే అనేక దఫాలు గనులశాఖకు, జేపీ సంస్థకు పదేపదే లేఖలు రాస్తోందే తప్ప, ఒత్తిడి మాత్రం తీసుకురావడంలేదు.