ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పుస్తకాలు చదివితే.. సామాన్యులు మహానుభావులుగా ఎలా ఎదిగారో తెలుస్తుంది' - కృష్ణా జిల్లా వార్తలు

Library Opening: కన్న తల్లిని, మాతృభాషను ఎప్పటికీ మర్చిపోవద్దని శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ సూచించారు. పుస్తకాలు చదివితే సామాన్యులు మహానుభావులుగా ఎలా ఎదిగారో తెలుస్తుందన్నారు. ముదునూరులో నాగులపల్లి భాస్కరరావు.. తన తండ్రి, స్వాతంత్య్ర సమరయోధుడు నాగులపల్లి సీతారామయ్య, తల్లి సోమిదేవమ్మ పేరిట పిల్లల గ్రంథాలయం ఏర్పాటు చేయటాన్ని అభినందించారు.

Mandali Buddhaprasad‌
Mandali Buddhaprasad‌

By

Published : Feb 22, 2022, 8:58 AM IST

కన్న తల్లిని, మాతృభాషను ఎప్పటికీ మర్చిపోవద్దని శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ సూచించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ముదునూరులో నాగులపల్లి భాస్కరరావు తన తండ్రి, స్వాతంత్య్ర సమరయోధుడు నాగులపల్లి సీతారామయ్య, తల్లి సోమిదేవమ్మ పేరిట ఏర్పాటు చేసిన పిల్లల గ్రంథాలయాన్ని పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి ప్రారంభించారు.

‘‘పుస్తకాలు చదివితే సామాన్యులు మహానుభావులుగా ఎలా ఎదిగారో తెలుస్తుంది. ముదునూరులో పిల్లల కోసమే గ్రంథాలయం ఏర్పాటు చేయడం, ఇందులో వ్యక్తుల జీవితచరిత్ర లు, ఆత్మకథల పుస్తకాలను మాత్రమే ఉంచడం అభినందనీయం. ప్రతి ఒక్కరు మహాత్మాగాంధీ ఆత్మకథ చదవాలి. స్వాతంత్య్ర పోరాట సమయంలో ముదునూరుకు గాంధీజీ వచ్చారు. హరిజనులకు గుడిలోకి ప్రవేశం కల్పించారు. ఇక్కడ 1914లోనే గ్రంథాలయం ఏర్పడింది’’ -బుద్ధప్రసాద్‌, శాసనసభ మాజీ ఉపసభాపతి

సృజనాత్మక ఆలోచనలు మాతృభాషతోనే వస్తాయని, అందుకే ప్రాథమిక విద్య మాతృభాషలోనే సాగాలని కె.రామచంద్రమూర్తి స్పష్టం చేశారు.

‘‘ఆత్మకథలు, జీవిత చరిత్రలతో ఏర్పాటుచేసిన మొదటి గ్రంథాలయమిది. అన్నీ తెలుగులోనే ఉన్న పుస్తకాలను అందుబాటులో ఉంచాం. పిల్లలు ఏవిధంగా చదువుతున్నారు? చదవడానికి ఇష్టపడుతున్నారా? లేదా? అనే అంశాలపై పరిశోధనలు చేస్తాం’’-నాగులపల్లి భాస్కరరావు, గ్రంథాలయం నిర్వాహకులు, సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ ఛైర్మన్‌ (న్యూదిల్లీ)

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయాల అసోసియేషన్‌ కార్యదర్శి రావి శారద, ఆకాశవాణి విశ్రాంత డైరెక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌, సీనియర్‌ సిటిజన్స్‌ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

సొంతింటినే గ్రంథాలయంగా..
విద్య, అభివృద్ధిలో ప్రాథమిక పరిశోధన(బ్రెడ్‌) అనే సంస్థను ప్రారంభించిన సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ ఛైర్మన్‌ (న్యూదిల్లీ) నాగులపల్లి భాస్కరరావు... గ్రామీణ విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు గ్రంథాలయాల ఏర్పాటుకు నడుంబిగించారు. మానసిక అభివృద్ధితో సంబంధం లేని చదువులతో ఉపయోగం లేదనేది ఆయన అభిప్రాయం. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని 1,670 పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు పుస్తకాలను అందించారు. తన పుట్టినూరు ముదునూరులోని పాఠశాలకు మొదట టీవీ, కంప్యూటర్‌లను అందించారు. వీటితో పిల్లల్లో వస్తున్న మార్పులపై పరిశోధన చేశారు. తర్వాత కొన్ని పుస్తకాలను అందించి పిల్లలు చదివేలా ప్రోత్సహించారు. వాటిని చదివిన పిల్లల్లో గుణాత్మక మార్పులను గమనించారు. విషయ జిజ్ఞాసతోపాటు తరగతిలో ఉపాధ్యాయులను ప్రశ్నించే తత్వం పెరుగుతున్నట్లు గ్రహించారు. వెంటనే ముదునూరులోని సొంతింటిని తన తల్లిదండ్రుల పేరిట పిల్లల గ్రంథాలయంగా మార్చేశారు. 753 స్వీయ జీవిత చరిత్రలు, ఆత్మకథల పుస్తకాలను అందుబాటులో ఉంచారు. ఇది 24 గంటలు పని చేస్తుంది.

ఇదీ చదవండి :

Khiladi:రవితేజ ‘ఖిలాడీ‘లో బాలనటి.. అభినయంలో మేటి!

ABOUT THE AUTHOR

...view details