ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడ్​ ప్రైడే : త్యాగమూర్తి ఏసు దారి మానవాళికి ఆదర్శమార్గం - Jesus Sacrifices latest News

చావుపుట్టుకలు ఉచ్ఛ్వాస, నిశ్వాసల్లా అవిభాజ్యాలు. పుట్టుక సంభవించేటప్పుడే చావు కూడా అప్పుడే రాసి పెట్టి ఉంటుంది. అనివార్యమైన మృత్యువు నుంచి తప్పించేవి ధైర్యం, త్యాగాలే. వాటితో శాశ్వతత్వం వస్తుంది. అమృతత్వం సాధ్యమవుతుంది. దీన్ని క్రీస్తు తన జీవితంలో నిరూపించారు. ప్రభువు జీవితంలోని చివరి ఘట్టాలు అమృతత్వాన్ని ఎలా సాధించాలో చాటి చెబుతాయి. నేడు గుడ్​ఫ్రైడ్​ సందర్భంగా ఏసు ప్రభూ త్యాగాన్ని స్మరించుకుందాం.

గుడ్​ ప్రైడే : త్యాగమూర్తి ఏసు దారి మానవాళికి ఆదర్శమార్గం
గుడ్​ ప్రైడే : త్యాగమూర్తి ఏసు దారి మానవాళికి ఆదర్శమార్గం

By

Published : Apr 2, 2021, 3:46 AM IST

ఒక కమ్మరి చక్రంపై మట్టి ముద్దను ఉంచుతాడు. అది ప్రారంభంలో విరిగిపోయి వికృతంగా మారినా తన చేతులతో మళ్లీ సరిచేస్తాడు. ఆ మట్టి ముద్ద మంచి ఆకృతిగల పాత్రగా మారేవరకు అతను ప్రయత్నిస్తూనే ఉంటాడు. మట్టి ముద్దలాంటి మనుషులను మహోన్నతులుగా మలిచేందుకు ప్రభువు సిలువపై బలియాగానికి సిద్ధమయ్యారు. అలా ఆయన ప్రజల పాపాలను ప్రక్షాళన చేసేందుకు మరణానికి సిద్ధపడ్డ రోజు శుభ శుక్రవారమైంది.

క్రీస్తూ సిలువపై మరణించి మూడో రోజు లేచారు. అదే ఈస్టరు పర్వదినం. ఈ దేహం మాత్రమే.. నేను అనుకునే మనిషి ఎన్నో పాప కార్యాలకు సిద్ధమవుతాడు. దేహంలో ఉన్న ఆత్మమాత్రమే శాశ్వతం అనుకునే వ్యక్తి విద్వేషాల నుంచి విడుదలవుతాడు. నిరంతరం ప్రేమను పంచుతుండేవారికి స్వర్గం సొంతమవుతుంది. అదే జీవం అసలు రూపం. అని ఆయన చాటారు.

క్రీస్తు ప్రభువు శిష్యుడైన యోహాను యేసు ప్రేమను అగాపే అనే గ్రీకు మాటలో వర్ణించారు. అంటే కళంకం లేనిది అని అర్థం. ఆ ప్రేమ ఎంత ఉన్నతమైందో ఆయన ప్రపంచానికి చాటారు. అతని పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా, ముప్పై నాణేల కోసం ప్రభువును మతాచార్యులకు అప్పగించాడు. అలా చేస్తాడని ముందే తెలిసినా, ప్రభువు ముందు రోజు రాత్రి విందులో యూదాకు ప్రేమగా ఆహారాన్ని తినిపించి ‘నువ్వు చేయాల్సిన పనిని త్వరగా పూర్తిచేయి’’ అన్నారు.

త్యాగానికి ప్రతీక..

తనను చావు వైపు తీసుకెళ్లిన వ్యక్తిని కూడా ప్రేమించారు ప్రభువు. సైనికులు బంధించినప్పుడు ‘మీరు నన్ను బంధించండి. నా శిష్యులను వదిలిపెట్టండి’ అనడం త్యాగంతో కూడి తెగువకు నిదర్శనం.

ప్రతి మంచి పనినీ ఆచరించారు..

యూదు ధర్మజ్ఞులు విశ్రాంతి దినాన ముప్ఫై తొమ్మిది పనులు చేయకూడదని నిషేధం విధించారు. ప్రభువు ఆ ఆజ్ఞలను పాటించలేదు. మానవాళికి మంచి చేసే ప్రతి పనినీ చేశారు. విశ్రాంతి దినాల్లో రోగులకు చికిత్స చేశారు. దేవాలయ ప్రాంగణం నుంచి వ్యాపారులను బయటకు తరిమారు. శాంతి కరుణ ప్రేమలతో పరలోక రాజ్య ప్రవేశం గురించి ప్రవచిస్తున్న క్రీస్తు తమకు పోటీగా రాజ్యాధికారం చేపడతాడని ఆనాటి మతాధికారులు, పాలకులు భావించారు. ఆయనపై ఆరోపణలు చేసి విచారణకు నిలబెట్టారు. ప్రభువు ఎక్కడా సంయమనం, స్థైర్యం కోల్పోలేదు.

సత్యం కోసం బలియాగానికి..

తాను నమ్మిన మార్గాన్ని, ధర్మాన్ని వివరించారు. విశ్రాంతి దినాన చనిపోతున్న మనిషికి స్వస్థత చేకూర్చడం పాపమా ? పవిత్రమైన దేవాలయాన్ని వ్యాపారకేంద్రంగా మార్చారని ప్రశ్నించడం నేరమా ? అంటూ వారిని ఎదుర్కొన్నారు. చివరకు సత్యం కోసం బలియాగానికి సిద్ధపడ్డారు.

క్రీస్తుపై విచారణకు ఆనాటి చక్రవర్తి నియమించిన న్యాయాధికారి పొంతి పిలాతు. ఆయనకు క్రీస్తును శిక్షించడం ఇష్టం లేదు. ప్రభువు నిష్కళంకుడని బలంగా నమ్మాడాయన. ఆయన క్రీస్తును ఎన్నో విధాలుగా ప్రశ్నించాడు. తాను నిరపరాధినని, శిక్ష వేయకుండా చూడమని క్రీస్తు వేడుకుంటారని చూశాడు. కానీ సత్యం మాత్రమే శాశ్వతమని నమ్మిన ప్రభువు ధైర్యంగా మరణ శిక్షకే మొగ్గు చూపారు. క్రీస్తు ధైర్యసాహసాలకు ఆశ్చర్యపోయిన పిలాతు తీర్పు చెప్పిన తర్వాత కూడా ఎంతో ఆవేదన చెందాడు. అలా ఏసు ప్రభువు చూపిన దారి ప్రపంచ మానవాళికి ఆదర్శమయ్యాయి.

ఇదీ చూడండి :'కొవిడ్ నిబంధనలు పాటిస్తూ గుడ్​ప్రైడే ప్రార్థనలు జరుపుకోండి'

ABOUT THE AUTHOR

...view details