తెలుగువారికి తొలి జ్ఞానపీఠాన్ని అందించిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ 126వ జయంతి సభను విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. విశ్వనాథుని ప్రతీ రచనలో భారతీయ ఆత్మ, జీవుని వేదన ప్రతిబింబిస్తాయని సాహితీవేత్తలు కొనియాడారు. ప్రతీ అక్షరంలోనూ అసాధారణ ఊహాశక్తిని, అద్భుత రచనాశైలిని నింపి పాఠకుల హృదయాలలోకి పరుగులెత్తించగలిగిన శక్తి ఆయన సొంతమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కవిసామ్రాట్ పేరిట ఎల్.బి.శ్రీరాం నిర్మించిన లఘుచిత్రాన్ని ప్రదర్శించారు.
తెలుగు సాహిత్య ప్రక్రియల్లో విశ్వనాథ స్పృశించని ప్రక్రియలేదని.. తన రచనల ద్వారా కుల, మతాతీత విధానాలను ఎండగట్టారని వక్తలు అన్నారు. ఆధునిక తెలుగు రచయితల్లో ఆయన పేరు లేకుండా తెలుగు సాహిత్య చరిత్ర గురించి వివరించలేమని చెప్పారు. కవిగా, పండితునిగా, నవలా రచయితగా, నాటక కర్తగా, విమర్శకుడిగా, గాయకుడిగా రాణించిన విశ్వనాథ సత్యనారాయణ.. 1976 అక్టోబరు 18న తుది శ్వాస విడిచారు. ఆయన గొప్పతనం నేటితరానికి తెలియజేయాలని విశ్వనాథ నివాసాన్ని సందర్శనశాలగా చేసేందుకు తమ వంతు ప్రయత్నిస్తామని అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. జయంతి సభలో విశ్వనాథ సత్యనారాయణ మనుమడు విశ్వనాథ పద్యాలు పాడి వినిపించారు.