విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి, ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానం చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం మరింత బాధ్యతతో స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. దిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులతో మాట్లాడుదామంటే తమకు పార్లమెంటులో సభ్యులు లేరని, వైకాపాకు 22 మంది సభ్యులు ఉన్నా ఎందుకు మాట్లాడడం లేదని జనసేనాని ప్రశ్నించారు. కార్మికుల కుటుంబాలకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులకు, వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
విశాఖ ఉక్కు అంశంపై అసెంబ్లీ తీర్మానం చేయాలి: పవన్ - విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై పవన్ కల్యాణ్ స్పందన
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కార్మికుల కుటుంబాలకు అధికార పార్టీ నేతలు భరోసా కల్పించాలని కోరారు. పురపాలక ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేసిన, గెలుపొందిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ధనబలం, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం, అభ్యర్ధులను బెదిరించడం వంటి చర్యల ద్వారా పురపాలక ఎన్నికల్లో వైకాపా గెలిచిందని పవన్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రభావవంతంగా పని చేసిన ఎన్నికల కమిషన్.. మునిసిపాలిటీ ఎన్నికల్లో సమర్థంగా పని చేయలేదని ఆక్షేపించారు. పురపాలక ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 184 వార్డుల్లో 14.86 శాతం ఓట్ల శాతాన్ని కైవసం చేసుకుందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో జనసేన తరఫున గెలిచిన వారికి, పోటీలో నిలిచిన అభ్యర్ధులకు పవన్ అభినందనలు తెలిపారు.
ఇదీచదవండి.