కరోనాను సైతం లెక్కచేయకుండా వార్తలు సేకరిస్తూ.. అధికారులకు, ప్రజలకు మధ్య వారధిగా ఉంటున్న మీడియా మిత్రులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని జనసేన నేతలు విమర్శించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఓ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి మరణానికి పూర్తిగా వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. అతడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ.. పార్టీ నేత రాయపూడి వేణుగోపాల్ రావుతో సహా పలువురు జనసైనికులు తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఎన్నో సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ.. ప్రజలకు న్యాయం అందేలా చేస్తున్న వారికి సరైన వైద్యం అందించలేకపోవడం చాలా బాధాకరమన్నారు.
ఇదీ చదవండి:తల్లితో సహా.. గర్భిణీ భార్య, పిల్లల్ని నరికి చంపిన భర్త
కొవిడ్ రోగికి 3 గంటల్లో పడకలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ స్పష్టంగా చెప్పినా.. ఆ రిపోర్టర్‌కు సుమారుగా 14 గంటలు బెడ్ ఇవ్వలేదని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో చికిత్స అందించకుండా అతడి ప్రాణాలు తీశారని ఆరోపించారు. మృతుడి భార్య అందరి కాళ్లు పట్టుకొని.. అయ్యా నా భర్తను కాపాడండి అంటూ ప్రాదేయపడిన ఆమె రోదన అరణ్యఘోషగానే మిగిలిపోయిందని గుర్తు చేశారు. అధికారులు వెంటనే స్పందించి.. బాధితుడి కుటుంబానికి రూ. 50 లక్షలు నష్ట పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, అతడి పిల్లలకు ఉచిత విద్యావసతి కల్పించాలని పార్టీ తరుపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆక్సిజన్ సదుపాయాలు అందుబాటులో ఉంచాలన్నారు.
ఇదీ చదవండి:పెడన మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు గుండెపోటుతో మృతి