మొదటి సచివాలయ నోటిఫికేషన్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పూర్తై, మెరిట్ లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులతోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీలను భర్తీ చేయాలని... జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. మెరిట్ లిస్ట్ వెయిటేజ్‌లో స్వల్ప తేడాతోనే అభ్యర్థులు ఉన్నారన్నారు.
ప్రభుత్వం తీసుకున్న రెండో నోటిఫికేషన్ నిర్ణయం వల్ల... మొదటి నోటిఫికేషన్లో 7 వేల నుంచి 10 వేల మెరిట్ అభ్యర్థులందరూ ఉద్యోగాలు రాక నష్టపోతున్న అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
హార్టికల్చర్ విభాగంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయ్యాక విద్యార్హతలు మార్చడం వలన ఉద్యోగాలు రాక చాలామంది అభ్యర్థులు నష్టపోయారని... వారు కోర్టును ఆశ్రయించగా కోర్టు వారు రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటరు దాఖలు చేయమని రెండుసార్లు కోరగా ఇంతవరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంతో హార్టికల్చర్ అభ్యర్థులు నష్టపోయారన్నారు.