గుంటూరు జిల్లా చీరాలలో ఎస్సీ యువకుడి మరణానికి కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై రోజురోజుకీ దాష్టీకాలు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. సీతానగరం పోలీస్ స్టేషన్లో ఎస్సీ యువకుడికి ఆటవికంగా శిరోముండనం చేయించిన ఘటన కళ్ల ముందు ఉండగానే.. చీరాలలో పోలీసులు ఓ ఎస్సీ యువకుడిని పొట్టనపెట్టుకున్న తీరు బాధ కలిగించిందన్నారు.
చీరాల పోలీసులపై చర్యలు తీసుకోవాలి: నాదెండ్ల
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై రోజురోజుకీ దాష్టీకాలు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. చీరాలలో ఎస్సీ యువకుడి మరణానికి కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ లపై ఇన్ని దాష్టీకాలు చోటు చేసుకొన్నా.. అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.
చీరాల థామస్ పేటకు చెందిన ఎరిచర్ల కిరణ్ కుమార్ అనే ఎస్సీ యువకుడు మాస్క్ పెట్టుకోకుండా రోడ్డు మీదకు వచ్చాడని అతనిపై పోలీసులు లాఠీతో తీవ్రంగా కొట్టడం వల్ల ప్రాణాలు కోల్పోయాడని పేర్కొన్నారు. మృతుని కుటుంబానికి నాదెండ్ల మనోహర్ ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. కిరణ్ కుమార్ మరణానికి కారణమైన పోలీసు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ లపై ఇన్ని దాష్టీకాలు చోటు చేసుకొన్నా.. అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వారి నియంతృత్వ ధోరణిని తెలియచేస్తోందని విమర్శించారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 65 మంది మృతి