Pawan Kalyan: జనసేన విధానానికి రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలే స్ఫూర్తి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పోరాట పంథాపై లోహియా ఆలోచనల ప్రభావం ఉందని పవన్ తెలిపారు. గురువారం రామ్ మనోహర్ లోహియా జయంతి సందర్భంగా ఆయనకు పవన్ కల్యాణ్ అంజలి ఘటించారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ సంస్మరణ దినం సందర్భంగా వారికి అంజలి ఘటించారు. దేశమాత దాస్యశృంఖలాలను తెంచడానికి ఈ ముగ్గురు వీరులు లాహోర్ జైలులో ఉరి కంబాన్ని ముద్దాడారని గుర్తు చేసుకున్నారు. మహానీయులను నిత్యం స్మరించుకోవటంతో పాటు... దేశవ్యాప్తంగా వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు.
సామరస్యంగా వ్యవహరించాలి... రామ్ మనోహర్ లోహియా ప్రతిపాదించిన సోషలిస్ట్ సిద్ధాంతాలను అర్థం చేసుకుంటే అన్ని వర్గాల ప్రజలు సామరస్య భావనతో ముందుకు వెళ్తారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం రామ్ మనోహర్ లోహియా జయంతి సందర్భంగా ఆయనకు పవన్ కల్యాణ్ అంజలి ఘటించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పోరాట పంథాపై లోహియా ఆలోచనల ప్రభావం ఉందని పవన్ ఒక ప్రకటనలో తెలిపారు. జనసేన విధానమైన ''ఎలుగెత్తు.. ఎదిరించు.. ఎన్నుకో...'' పదాల వెనుక రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలే స్ఫూర్తి అని తెలిపారు. దేశంలో కుల సమస్య, శాస్త్రీయ అవగాహన, వాటి పుట్టుపూర్వోత్తరాల గురించి సాధికారికంగా మాట్లాడటంతో పాటు... సమసమాజ స్థాపన కోసం లోహియా తపించారని పేర్కొన్నారు. రాజ్యాధికారానికి దూరంగా ఉన్న కులాలు ఏ విధంగా ముందుకు వెళ్లాలో ‘ది క్యాస్ట్ ఇన్ ఇండియా’ పుస్తకంలో వివరించారని... అందులో నుంచే జనసేన పార్టీ కులాలను కలిపే ఆలోచనా విధానం అనే సిద్ధాంతాన్ని తీసుకుందని వివరించారు. లోహియా చెప్పినట్లు కులాల మధ్య అంతరాలు తగ్గించడం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత సమాజం, ముఖ్యంగా యువత లోహియా సిద్ధాంతాలు అర్థం చేసుకొంటే కులాల సంక్లిష్టత నుంచి బయటపడవచ్చని అభిప్రాయపడ్డారు.