Janasena Leader Nadendla Manohar : రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం భయంకరమైన పాలనను, తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు వస్తారని ప్రశ్నించారు. ఏపీలో పెట్టుబడుల గురించి చెప్పాల్సిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కోడిపెట్టలు, కోడిగుడ్ల గురించి మాట్లాడుతున్నారని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మనోహర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మంత్రివర్గ భేటీలో కడప స్టీల్ ప్లాంట్ ప్రస్తావన ఎందుకు లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రామాయంపట్నం పోర్టులో జిందాల్ సంస్థకి రెండు కమర్షియల్ బెర్తులు ఇస్తున్నట్టు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రామాయంపట్నం, కావలిలలో ఆ సంస్థకు ఎందుకు భూములు కేటాయించారు.. దీని వెనక ఏం జరిగింది? ముఖ్యమంత్రికి జిందాల్ సంస్థతో ఉన్న ఒప్పందం ఏంటో వెల్లడించాలని కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మూడో విడత పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని మనోహర్ ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
అమరావతి రాజధాని వ్యవహారంలో తీసుకోవాల్సిన బాధ్యతను విస్మరించారని.. అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లకుండా ఒక తరానికి ఉపయోగపడాల్సిన కార్యక్రమాన్ని చేజేతులారా చంపేశారని విమర్శించారు. విశాఖలో పెట్టుబడులు తీసుకువస్తామని చెబుతున్న ఈ ప్రభుత్వం.. అక్కడ ఉన్న మౌలిక వసుతుల్ని ఎందుకు వినియోగించుకోవడం లేదని నిలదీశారు. రెండు లక్షల చదరపు అడుగుల స్థలం ఉంటే ఎందుకు ఆ భవనాలు ఉపయోగించుకోవడం లేదని.., ఆగస్టులో ఇన్ఫోసిస్ వచ్చేస్తుందని చెప్పినా.. ఎందుకు ఇప్పటికీ ప్రారంభించలేదని.. కోడిపెట్టల గురించి మాట్లాడే మంత్రి విశాఖలో ఎందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారో చెప్పాలన్నారు.