janasena announcement : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ... రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి పాలవ్వగా.. నాలుగేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా విజయకేతనం ఎగురవేసింది. ఇదే సమయంలో అధికార వైఎస్సార్సీపీ నాయకులు కొందరు.. ప్రభుత్వాన్ని, సీఎం పనితీరును బాహాటంగానే విమర్శిస్తున్నారు. తమకు గట్టి పట్టుందని చెప్పుకొంటున్న నెల్లూరు జిల్లా నుంచి అధికార పార్టీ నాయకులు టీడీపీలోకి క్యూ కట్టడంతో రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది.
జనసేనలో జోరు.. ఇటీవల పదో వార్షికోత్సవ సభను విజయవంతంగా ముగించిన జనసేనలో జోరు కనిపిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన పార్టీ శ్రేణులను ఉద్దేశించి పవన్ చేసిన ప్రసంగం ఆసక్తి రేపింది. అధికార వైఎస్సార్సీపీ మైండ్ గేమ్ ఆడుతున్న నేపథ్యంలో.. ఎన్నికల వ్యూహాలు, పొత్తులపై ఆందోళన వద్దు అని పార్టీ నాయకులు, కార్యకర్తలకు జనసేన స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ నుంచి అంతర్గత సమాచారం అందించింది.
జనసేన క్లారిటీ... ఎన్నికల వ్యూహాలు, పొత్తులపై ఆందోళన వద్దు అని పార్టీ నాయకులు, కార్యకర్తలకు జనసేన స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ నుంచి అంతర్గత సమాచారం అందింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పవన్ చెప్పారని తెలియజేస్తూ.. ఆ ప్రకటన చేసినప్పటి నుంచి అధికార పార్టీ వైఎస్సార్సీపీ మైండ్‌గేమ్ ఆడుతోందని పేర్కొంది. వాస్తవాలు తెలుసుకోకుండా, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలతో గందరగోళానికి గురికావొద్దని శ్రేణులకు విజ్ఞప్తి చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో తీసుకునే నిర్ణయాలను అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని స్పష్టం చేసింది. పొత్తులతో ముందుకెళ్తారా? లేక ఇతర వ్యూహాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాల్లో ఆందోళన అవసరం లేదని సూచిస్తూనే.. పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా చేపట్టాలని నాయకులు, కార్యకర్తలకు జనసేన పార్టీ దిశా నిర్దేశం చేసింది.