ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

polavaram: గట్టు పేరుతో గుట్టకే ఎసరు - కృష్ణా జిల్లా తాజా సమాచారం

పోలవరం కాలువ కట్ట పేరుతో కృష్ణా జిల్లాలోని కొత్తూరు తాడేపల్లి మార్గంలో జక్కంపూడి కొండలను కరిగించేస్తున్నారు. రేయింబవళ్లు ఇక్కడ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. వందల ఘనపు మీటర్లు తవ్వుతున్నారు. గుట్ట పైకి ఎక్కి మరీ తవ్వకాలు జరుపుతున్నారు. అసలు ఈ ప్రాంతం కాలువ గట్టు పరిధిలోకి వస్తుందా..? జలవనరుల శాఖకు సంబంధం ఉందా..? అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.

Jakkampudi hills
జక్కంపూడి కొండలు

By

Published : Aug 11, 2021, 10:48 AM IST

పోలవరం కాలువ గట్టు గ్రావెల్‌ తవ్వకానికి జలవనరుల శాఖ అనుమతి ఇచ్చేసింది. వెంటనే గనుల శాఖ ఆమోదం తెలిపింది. విజయవాడ గ్రామీణ మండలం నైనవరం గ్రామం పరిధిలో ఉంది. కొత్తూరు తాడేపల్లి మార్గంలో జక్కంపూడి కొండలను కాలువ గట్టు పేరుతో కరిగించేస్తున్నారు. రేయింబవళ్లు ఇక్కడ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. వందల ఘనపు మీటర్లు తవ్వుతున్నారు. గుట్ట పైకి ఎక్కి మరీ తవ్వకాలు జరుపుతున్నారు. అసలు ఈ ప్రాంతం కాలువ గట్టు పరిధిలోకి వస్తుందా..? జలవనరుల శాఖకు సంబంధం ఉందా..? అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.

వివాదాస్పదంగా మారిన గ్రావెల్ తవ్వకాలు

కవైపు కొండపల్లి అభయారణ్యం ప్రాంతంలో గ్రావెల్‌ తవ్వకాలు వివాదాస్పదంగా మారాయి. తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక్కడ తవ్వకాలపై గనుల శాఖపై ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. అక్రమంగా లీజులు ఇవ్వడం.. అక్రమ తవ్వకాలపై కొలతలు తీసి.. జరిమానా వేయాలంటే.. కనీసం ఇంతవరకు అటవీశాఖకు సహకరించకపోవడం లాంటి ఫిర్యాదులు ఉన్నాయి. మరోవైపు పోలవరం కాలువ కట్టపై విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్నారు. పోలవరం కాలువ కట్ట పేరుతో నైనవరం గ్రామం పరిధిలో అనుమతి ఇచ్చారు. అక్కడ దాదాపు 50వేల క్యూబిక్‌ మీటర్లకు అనుమతి ఇస్తే.. లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి లేపేశారు. దాని అనుమతులు పూర్తయ్యాయి. అదే నైనవరం పరిధిలో జక్కంపూడి గ్రామ సమీపంలో పోలవరం కాలువ కట్ట పేరుతో కొండలను తవ్వుతున్నారు. ఇక్కడ 40వేల క్యూబిక్‌ మీటర్లకు ఒప్పందం చేసుకున్నామని చెబుతున్నారు. ఇప్పటికే దాదాపు 50 వేల క్యూబిక్‌ మీటర్ల తవ్వకాలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వాస్తవానికి ఇది పోలవరం కాలువ కట్టకు సంబంధం లేదని గ్రామస్థులు చెబుతున్నారు.

అసలు కథ వేరే..!

జిల్లాలో మట్టి, గ్రావెల్‌ తవ్వకాలకు ఇటీవల కాలంలో విచ్చలవిడిగా అనుమతులు తీసుకున్నారు. పోలవరం కాలువ కట్టలే కాకుండా బంజరు భూముల్లోనూ తవ్వకాలకు అనుమతులు పొందారు. ఈ మట్టిని జాతీయ రహదారి నిర్మాణానికి, జగనన్న కాలనీల లేవుట్ల చదునుకు, రహదారులకు, ప్రైవేటు వెంచర్లకు తోలుతున్నారు. కొంతమంది దీనిపై గుత్తాధిపత్యం ప్రదర్శిస్తున్నారు. క్వారీలు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. పోలవరం కట్టపై దాదాపు 105 ప్రాంతాల్లో అనుమతులు పొంది తవ్వకాలు జరిపారు. అవి వివాదాస్పదం కావడంతో ఇటీవల అనుమతులు ఇవ్వడం నిలిపివేశారు. తాజాగా నైనవరం ప్రాంతంలో అధికార పార్టీకి చెందిన నేత దీన్ని బినామీగా దక్కించుకున్నట్లు తెలిసింది. ఓ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఉన్న ఆయన ఓ సంస్థ పేరుతో బైపాస్‌ పనులకు గ్రావెల్‌ తరలిస్తున్నారు. ఇక్కడ మట్టితో పాటు కంకర రాయి కూడా ఉంది. మొదట నైనవరంలో 50వేల క్యూబిక్‌ మీటర్లకు, తర్వాత నైనవరం-అంబాపురం పరిధిలో 40వేల క్యూబిక్‌ మీటర్లకు అనుమతి తీసుకున్నారు. వాస్తవానికి పోలవరం కట్టమీద ఒక్క రీచ్‌ పరిధిలో 5వేల క్యూబిక్‌ మీటర్లకు మించి అనుమతి ఇవ్వకూడదు. కానీ ఇక్కడ కొండ ఉండడంతో ఏకంగా 40వేల క్యూబిక్‌ మీటర్లకు ఇచ్చినట్లు తెలిసింది. ఇక్కడ పోలవరం కాలువను కొండను తొలచి ఏర్పాటు చేశారు. అక్కడ వచ్చిన గ్రావెల్‌ను గతంలోనే దూర ప్రాంతాలకు తరలించారు. రెండు గుట్టల మధ్య కాలువ ప్రవాహం ఉంటుంది. పోలవరం కాలువ గట్టును ఆసరాగా చేసుకుని ఏకంగా కొండనే తవ్వేస్తున్నారు. దీనికి క్యూబిక్‌ మీటరుకు జలవనరుల శాఖకు కొంత, గనుల శాఖకు రాయల్టీ కొంత చెల్లించాల్సి ఉంటుంది. అనుమతి తీసుకున్న దానికి మాత్రమే రాయల్టీ చెల్లిస్తారు. అనుమతి కంటే ఎక్కువ పరిమాణం తవ్వకాలు జరిపారనేది కొలతలు తీసేవారు లేరు. గనుల శాఖ ఆ దిశగా చర్యలే తీసుకోవడం లేదు. ఇప్పటికే పోలవరం కాలువ కట్టలపై అనేక ప్రాంతాల్లో అనుమతించిన దాని కన్నా.. వందల రెట్లు తవ్వకాలు జరిగాయి. కొలతలు వేసి జరిమానాలు వేస్తే గనుల శాఖకు రూ.కోట్లలో ఆదాయం వస్తుంది. జలవనరుల శాఖకు అదే స్థాయిలో ఆదాయం ఉంటుంది. కానీ ఆ దిశగా పట్టించుకునేవారే కరవయ్యారు.

బాధ్యులు ఎవరు..?

అక్రమ తవ్వకాలకు బాధ్యులు ఎవరు..? అంటే తమ పని కాదనే సమాధానం వస్తుంది. మా పైఅధికారులను అడగండి అనే సమాధానం ఇస్తున్నారు. గనుల శాఖ సహాయ సంచాలకులు నాగిని వివరణ కోరగా కేవలం నైనవరం పరిధిలో ఒకే ఒక్క దానికి అనుమతి ఇచ్చామని చెబుతున్నారు. కొండ గురించి అడిగితే ఆమె సమాధానం ఇవ్వడం లేదు. గనుల శాఖ ఉప సంచాలకులు సుబ్రహ్మణ్యంను వివరణ కోరగా.. తాను పరిశీలించి చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు. విజయవాడ ఏడీ పరిధిలో ఆమె బాధ్యత ఉంటుందని చెప్పారు. జలవనరుల శాఖ పోలవరం కాలువ డీఈఈ సత్యకుమార్‌ను సంప్రదించగా గుత్తేదారుతో ఒప్పందం చేసుకున్న విషయం వాస్తవమేనని ధ్రువీకరించారు. 40వేల క్యూబిక్‌ మీటర్ల తవ్వకాలకు ఒప్పందం ఉందన్నారు. ఈఈ వెంకటేశ్వరరావును ‘ఈనాడు’ వివరణ కోరగా .. కాలువ కట్ట పరిధిలో మాత్రమే తవ్వకాలకు అనుమతించామని చెప్పారు. కొండను తవ్వేందుకు అనుమతి లేదని వివరణ ఇచ్చారు. తాను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. కాలువ కట్ట పేరుతో గుట్టకు ఎసరు పెట్టినా.. రెవెన్యూ అధికారులు మాత్రం స్పందించడం లేదు.


ఇదీ చదవండి

MURDER MYSTERY: భూత వైద్యుడినంటూ లోబరుచుకుని.. పెళ్లికి పట్టుబట్టిందని హతమార్చి

ABOUT THE AUTHOR

...view details