వైకాపా అరాచకాలను ప్రతిఘటించేందుకు ప్రజలు కూడా సిద్ధమయ్యారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్యేలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. వైకాపా పాలనలో రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్‌ను కోల్పోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అప్పులు రూ. 5.35లక్షల కోట్లకు చేరాయని అన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తేవడమే తప్పైపోయిందని మండిపడ్డారు.
హైకోర్టు మందలిస్తే తప్పా ఉపాధి బిల్లులు చెల్లించరా...
ఉపాధి హామీ పనుల బిల్లులు చెల్లించకుండా రాక్షసంగా వ్యవహరించటంతో పాటు..మస్టర్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఐఏఎస్ అధికారుల్ని హైకోర్టు మందలించి.. జైల్లో పెడతామని హెచ్చరిస్తే.. పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నారని విమర్శించారు. ప్రజల మేలు కోసం నాడు చేసిన అభివృద్ధి పనుల్ని రాజకీయం చేసి కాంట్రాక్టర్లను ఇబ్బందిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి రెడ్డి విశాఖలో భూ అక్రమాలకు పాల్పడుతుంటే, సజ్జల రామకృష్ణారెడ్డి.. డీజీపీ మాదిరిగా వ్యవరిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
సమస్యలన్నింటికీ ప్రజా చైతన్యమే పరిష్కారం
ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు జగన్ అరాచకాలకు బానిసలయ్యారని..ఇది సొంత రాజ్యాంగం కాదని గ్రహించాలని హితవు పలికారు. సమస్యలన్నింటికీ ప్రజా చైతన్యమే పరిష్కారమన్న చంద్రబాబు.. సమైక్యంగా పోరాడేందుకు తెదేపా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుందని ప్రకటించారు. జగన్ రెడ్డి విధ్వంస విధానాలపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.