తూర్పుగోదావరి జిల్లా వెంకటాయపాలెంలో దళితులను అవమానించిన కేసులో ప్రధాన నిందితుడైన తోట త్రిమూర్తులుకు ఎమ్మెల్సీ పదవి దక్కడాన్ని నిరసిస్తూ భారత కార్మిక సంఘాల సమాఖ్య నేతలు.. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా నిర్వహించారు. తోట త్రిమూర్తులును ఎమ్మెల్సీగా చేయడం.. దళితులను జగన్ ప్రభుత్వం అవమానించడమేనని ఐఎఫ్‌టీయూ నగర ప్రధాన కార్యదర్శి పి.ప్రసాదరావు విమర్శించారు. దళితులపై దాడులు చేసే వారిని జగన్ కాపాడుతున్నారన్నారు.
ప్రైవేటీకరణ ద్వారా ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లకు భద్రత లేకుండా పాలకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ ల నిధులను పక్కదారి పట్టించకుండా వారి సంక్షేమానికి ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడులు,అత్యాచారాలు,హత్యల కు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలన్నారు. తక్షణమే ఎమ్మెల్సీ పదవి నుంచి తోట త్రిమూర్తులను తొలగించాలని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. అప్పటివరకూ తమ పోరాటం ఆగేది లేదని తేల్చి చెప్పారు.