ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 10, 2020, 8:16 PM IST

ETV Bharat / state

విజయవాడ ప్రమాదం: రంగంలోకి దిగిన బృందాలు.. విచారణ ముమ్మరం

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కొవిడ్ కేర్ సెంటర్​లో అగ్నిప్రమాద ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందాలు విచారణ ప్రారంభించాయి. ఉదయం నుంచి రమేష్ హాస్పిటల్స్, స్వర్ణ ప్యాలెస్​లో విద్యుత్, అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు తనీఖీలు చేపట్టారు. ప్రమాదం ఎలా సంభవించింది,.. ప్రమాదానికి కారణాలు, భద్రతా చర్యలు తదితర అంశాలపై ప్రాథమిక వివరాలు సేకరించారు. 48 గంటల్లోగా నివేదిక అందజేయాలనీ ప్రభుత్వం ఆదేశించటంతో బృందాలు తమ విచారణను వేగవంతం చేశాయి.

investigation on fire accident at vijaywada
స్వర్ణప్యాలెస్ ఘటనపై విచారణ ముమ్మరం

స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనపై ఏర్పాటు చేసిన కమిటీ విచారణ ప్రారంభించింది. బృందాలుగా విడిపోయి పలుచోట్ల తనీఖీలు చేపడుతున్నారు. బందర్ రోడ్డులోని రమేష్ హాస్పిటల్స్​లో, ఆస్పత్రికి సంబంధించిన మిగతా మూడు బ్రాంచ్​లలో బృందాలు తనీఖీ చేసి ఆస్పత్రిలో కొవిడ్ బాధితులు ఎంత మంది ఉన్నారు, చికిత్స ఎలా జరుగుతుందో, ఫీజు తదితర సమాచారం సేకరించారు. హోటల్​కి సంబంధించిన యాజమాన్యం నుంచీ సమాచారం సేకరిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతానికి ఈరోజు ఉదయమే విద్యుత్ అధికారులు చేరుకుని అగ్నిప్రమాదం ఎలా జరిగింది? ఎటువైపు నుంచి మంటలు వ్యాపించాయి వంటి విషయాలు పరిశీలించారు. అగ్నిప్రమాదం జరిగిన సర్వర్ రూంలో క్షుణంగా తనిఖీ చేశారు. ఫ్యూజులు, విద్యుత్ తీగలు పరిశీలించారు. హోటల్​లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఆర్పేందుకు ఏర్పాటుచేసే స్ప్రింకిల్స్, పొగ గుర్తించే పరికరాలు ఏర్పాటు చేసినా వాటిని వినియోగంలో ఉంచలేదని అగ్నిమాపక అధికారుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. సర్వర్ రూంలో అగ్నిప్రమాదం ఎలా జరిగిందో కారణాలు విశ్లేషించారు.

హోటల్​కు ఉన్న రెండో ద్వారం ఎందుకు మూసివేశారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై నివేదిక తయారు చేస్తున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది... ఫైర్ సెఫ్టీకి సంబంధించిన నిబంధనలు ఎంతవరకు అమలు చేశారు, ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారనే వివరాలపై దృష్టి సారించారు. వైద్య, ఆరోగ్య శాఖ నియమించిన ఉన్నత స్థాయి కమిటీ, జిల్లా యంత్రాంగం నియమించిన కమిటీ, పోలీసుల విచారణ బృందాలు వేరువేరుగా వివరాలు సేకరిస్తున్నారు. రమేష్ హాస్పిటల్స్ నిర్వహణలోని ప్రైవేట్ కొవిడ్ కేర్ సెంటర్లను తనిఖీ చేశారు.

ఘటనపై రమేష్ ఆసుపత్రి యాజమాన్యం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. హోటల్ స్వర్ణ ప్యాలెస్ కొవిడ్ కేంద్రంలో వైద్యపరంగా బాధితులకు మెరుగైన సేవలు అందించడంపై తాము శ్రద్ధ చూపామని, భవన నిర్వహణ బాధ్యత హోటల్ యాజమాన్యానిదేనని రమేష్ ఆసుపత్రి అధినేత డాక్టర్ పి.రమేష్ బాబు తెలిపారు.

హోటల్, ఆసుపత్రి యాజమాన్యాలతోపాటు ఈ ప్రమాదానికి సంబంధించి యాజమాన్యాల వివరణతోపాటు కొవిడ్ కేంద్రం అనుమతి మంజూరు అంశాలపైనా కమిటీలు వివరాలు సేకరిస్తున్నాయి. 48 గంటల కంటే ముందే మొత్తం నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని కమిటీలు భావిస్తున్నాయి.

స్వర్ణ ప్యాలెస్ ఘటనపై విచారణ ముమ్మరం

ఇదీ చదవండి: 'చికిత్స వరకే మా పని.. సౌకర్యాల బాధ్యత హోటల్ వాళ్లదే '

ABOUT THE AUTHOR

...view details