తాడేపల్లి అత్యాచార ఘటనను పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి నివాసానికి కిలోమీటరన్నర దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌తో పాటు విజయవాడ కమిషనరేట్ పోలీసులు తాడేపల్లి వచ్చి కేసు దర్యాప్తు పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ, కుంచనపల్లి, నులకపేట, మహానాడు రోడ్డులో క్షేత్రస్థాయిలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పుష్కరఘాట్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలు సేకరిస్తున్నారు. అనుమానితుల జాబితాను తయారుచేసి విచారిస్తున్నారు. కొందరు అనుమానితుల ఫోన్లకు పోలీసులు ప్రయత్నించగా..... వాటి టవర్ లొకేషన్లు బాధిత యువతి చికిత్స పొందుతున్న గుంటూరు GGH పరిసరాల్లోనే ఉండటంతో ఆఘమేఘాలపై పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా...ఆ ఫోన్లు వేరేవాళ్లు వినియోగిస్తున్నట్లు తేలింది.
అదుపులోకి నిందితులు
ఘటనకు పాల్పడిన వారిలో ఐదారుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అత్యాచారానికి పాల్పడింది మాత్రం ఇద్దరేనని ప్రాథమికంగా తేల్చారు. వీరికి మిగిలిన వారు సాయం చేసినట్లు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన రోజు బాధితులు అర్థరాత్రి 12 గంటలకు ప్రకాశం బ్యారేజి వద్ద ఉన్న పోలీసు అవుట్‌పోస్టు వద్దకు చేరుకుని తమ బంగారు ఆభరణాలు కొందరు దోచుకెళ్లారని ఫిర్యాదు చేశారు. గస్తీ విధుల్లో ఉన్న మహిళా ఎస్సై సిబ్బందితో కలిసి అత్యాచారం జరిగిన ప్రాంతానికి వెళ్లి చూడగా...కొందరు పడవలో విజయవాడ వైపు పారిపోతున్నట్లు గమనించారు. వారు వెంటనే తేరుకుని బ్యారేజీ మీద నుంచి విజయవాడ రాగా...అప్పటికే వారు పడవ వదలేసి వెళ్లిపోయినట్లు తెలిసింది.