ప్రతినిధి: ఈ రైతు భరోసా కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఎన్ని ఏర్పాటు చేస్తున్నారు?
మంత్రి : వైకాపా ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రైతుల సంక్షేమం కోసం ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగానే కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ రైతు భరోసా కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతీ గ్రామంలో 2వేల జనాభాకు ఒక రైతు భరోసా కేంద్రం గ్రామ సచివాలయానికి అనుబంధంగా ఉంటుంది. వీటి ద్వారా ప్రభుత్వం నాణ్యత పరిశీలించి, పరీక్షించి, ఆమోదించిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయిస్తారు. అది ఒక ఉద్యమంలా నేడు రాబోతోంది. దీనినే రైతు విజ్ఞాన కేంద్రంగా పెట్టాం. ఇక్కడ మామూలు గ్రంథాలయంతో పాటుగా డిజిటల్ లైబ్రరీ కూడా అందుబాటులో ఉంటుంది. రైతులు అక్కడున్న కియోస్క్‌ల ద్వారా కావల్సిన విత్తనాలు, పురుగు మందులు వంటి వాటిని ఆర్డరు ఇవ్వొచ్చు. వెంటనే రైతు ఆర్డర్ హబ్‌కు వెళ్తుంది. వాటిని కంపెనీ నుంచి తెప్పించి నేరుగా రైతు భరోసా కేంద్రాలకు రెండురోజుల్లో చేరవేస్తారు. అంతేకాకుండా రైతుకు ఏమైనా సమస్య ఉందని చెప్తే విజ్ఞాన కేంద్రం ద్వారా నేరుగా శాస్త్రవేత్తలకు అనుసంధానం చేస్తారు. శాస్త్రవేత్తలు ఆన్లైన్ ద్వారా వారికి సలహాలు, సూచనలు ఇస్తారు. ముఖ్యమంత్రి, అధికారులు అన్ని కేంద్రాలలోని రైతులతో ఒకేసారి ఆన్లైన్ ద్వారా మాట్లాడే అవకాశం ఉంది.
ప్రతినిధి: గతంలో సంప్రదాయ పద్ధతిలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేసేవారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా, భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా ఏమి మేలు జరగబోతోంది?
మంత్రి : గతంలో విత్తనాలు కావాలంటే మండలాలకు వెళ్లాల్సి వచ్చేది. క్యూలైన్లలో నిల్చుని వేచి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకుంటే నాణ్యమైన విత్తనాలు అందిస్తాం. సీజన్ దాటిపోకూడదని ఇప్పటికే 15రోజుల ముందు నుంచే మొదలు పెట్టారు. చరిత్రలోనే తొలిసారిగా వేరుశెనగ విత్తనాల పంపిణీని మే నెలాఖరుకే పూర్తి చేస్తున్నాం. ఎంతో పకడ్బందీగా అన్ని రకాల విత్తనాలను అందుబాటులో ఉంచాం. ఆధునిక సాంకేతికత, ప్రకృతి వ్యవసాయం, ఆక్వాకల్చర్ వంటి వాటిపై శిక్షణ అందిస్తున్నాం. మట్టి నమూనాల పరిశీలన, విత్తన నమూనాల పరిశీలన, ఆక్వా ప్రాంతాల్లో నీటి పరీక్షల కోసం కిట్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ-క్రాప్ బుకింగ్ వంటి కీలక సేవలు అందుబాటులోకి వస్తాయి. సీఎం ఆదేశాల మేరకు మార్కెట్ ఇంటెలిజెన్స్ నెట్ వర్క్ కూడా రైతు భరోసా కేంద్రాల నుంచి అమలు చేయబోతున్నాం. అక్కడి వ్యవసాయశాఖ సహాయకులు ప్రతిరోజు పంటల వివరాలను యాప్ ద్వారా మార్కెటింగ్ శాఖకు అందిస్తారు. మార్కెటింగ్ శాఖ ఆ వివరాలను అధ్యయనం చేసి పంటను అమ్మేందుకు సూచనలు చేస్తుంది. ఎమ్మెస్పీలు కూడా ప్రదర్శిస్తారు. పొలాల్లోనే ధాన్యం కొనుగోలు చేసేందుకు కూడా ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.