రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో చోరీలు జరుగుతున్న నేపథ్యంలో... కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆలయాల వద్ద పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు. ఈ నెల 14న కొర్లమండ గ్రామం శివారులోని దాసాంజనేయ స్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు హుండీని పగలకొట్టిన ఘటనపై 4 బృందాలను ఏర్పాటు చేసి విచారణ జరిపించారు.
దర్యాప్తులో భాగంగా... కొర్లమండ శివారు విద్యానగరం వద్ద అంతరాష్ట్ర నేరస్తుడు పఠాన్ సలార్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి చోరీకి అవసరమైన ఆయుధాలతో పాటు రూ. 2వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. గతంలో పలు ఆలయాల్లో హుండీల చోరీకి పాల్పడ్డట్లు విచారణలో తెలిందని తిరువూరు సీఐ వివరించారు. పఠాన్‌పై పలు పోలీసు స్టేషన్ల్లో సుమారు 80 కేసులు ఉన్నాయి. అతడిని తిరువూరు కోర్టులో హాజరు పరుస్తామని సీఐ ఎం.శేఖర్ బాబు తెలిపారు.