ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి కుటుంబ సభ్యుల కంపెనీలో జీఎస్టీ అధికారుల తనిఖీలు - inspections in sankeertha reddy company

GST Raids on Sushee Infra Company : మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి కుమారుడు, అతని బంధువులకు చెందిన సుశీ ఇన్​ఫ్రా సహా అనుబంధ సంస్థల్లో తనిఖీలు చేసిన జీఎస్టీ అధికారులు.. పెద్ద మొత్తంలో ఎగవేతలు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ క్రమంలోనే పలు దస్త్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్న అధికారులు ల్యాప్​టాప్​, కంప్యూటర్లు, హార్డ్​డిస్క్, సర్వర్లను ఫోరెన్సిక్​ ల్యాబ్​కు పంపారు. లాకర్​ను జప్తు చేశారు.

GST Raids on Sushee Infra Company
GST Raids on Sushee Infra Company

By

Published : Nov 15, 2022, 9:58 AM IST

GST Raids on Sushee Infra Company : తెలంగాణలో భాజపా నేత కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి కుటుంబసభ్యులు, బంధువుల పేర్లతో పెద్దసంఖ్యలో వ్యాపార సంస్థలున్నాయి. అందులో ప్రస్తుతం వ్యాపారం నిర్వహిస్తున్న సంస్థల వ్యాపార లావాదేవీలపై రాష్ట్ర జీఎస్టీ అధికారులు నిఘా పెట్టారు. ఆయా సంస్థలు నిర్వహిస్తున్న వ్యాపారం.. అవి చెల్లిస్తున్న జీఎస్టీ మొత్తాలను నిశితంగా పరిశీలించిన అధికారులు చెల్లింపుల్లో వ్యత్యాసం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆ మేరకు ఆయా సంస్థలపై కేసులు నమోదు చేశారు. అబిడ్స్, పంజాగుట్ట వాణిజ్య పన్నుల డివిజన్ల పరిధిలోని 20 సంస్థల్లో తనిఖీలు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.

రాజకీయ ప్రాధాన్యత కలిగిన సంస్థలు కావడంతో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూప్రసాదే స్వయంగా సోదాలకు నేతృత్వం వహించారు. నాలుగైదు రోజులుగా కసరత్తు చేసిన అధికారులు.. ఆ సంస్థలకు చెందిన వివరాలను సిద్ధం చేసి ఉంచారు. సోమవారం ఉదయం ముఖ్యమైన అధికారులతో పాటు దాదాపు 150 మందిని అబిడ్స్​లోని కమిషనర్ కార్యాలయానికి పిలిపించి 20 బృందాలకు సీల్డ్​ కవర్లు అందించారు. కొందరు అధికార్లను రాష్ట్ర కమిషనర్ కార్యాలయంలో రిజర్వ్​లో ఉంచారు.

కీలక పత్రాలు స్వాధీనం..: మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి కుమారుడు సంకీర్త్​రెడ్డికి చెందిన.. సుశీ ఇన్​ఫ్రా అండ్ మైనింగ్ సహా అనుబంధ సంస్థలపై ఏకకాలంలో తనిఖీలు చేశారు. 20 బృందాల్లో దాదాపు 150 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతం సుశీ ఇన్​ఫ్రా ఎండీగా రాజగోపాల్​రెడ్డి కుమారుడు సంకీర్త్​రెడ్డి ఉన్నారు. సుశీ ఇన్​ఫ్రా అండ్ మైనింగ్, సుశీ అరుణాచలా హైవేస్​ లిమిటెడ్, సుశీ చంద్రగుప్త్ కోల్​మైన్​ ప్రైవేట్ లిమిటెట్ తదితర 20 సంస్థల్లో అధికారులు సోదాలు చేశారు. ప్రధాన కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాల్లోనూ తనిఖీ చేసిన అధికారులు.. పెద్దఎత్తున దస్త్రాలు, హార్డ్​డిస్కులు, కంప్యూటర్లు, ప్రాజెక్ట్ అలాట్​మెంట్​ డాక్యుమెంట్లు, జీఎస్టీ చెల్లింపులకు చెందిన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటన్నింటినీ వాణిజ్య పన్నుల కమిషనర్ కార్యాలయానికి తరలించారు. లాకర్​ను సీజ్ చేసిన అధికారులు.. అక్కడ పోలీసులను కాపలా పెట్టినట్లు తెలుస్తోంది.

స్వాధీనం చేసుకున్న ల్యాప్​టాప్​లు, హార్డ్​డిస్కులు, కంప్యూటర్లను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపారు. జీఎస్టీ చెల్లింపుల్లో పెద్దమొత్తంలో వ్యత్యాసం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వ్యాపార లావాదేవీలు తక్కువ చూపి.. రూ.వందల కోట్లు పన్నుఎగవేతకు పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details