ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద వస్తోందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. 70 గేట్లను 9 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సుమారు నాలుగున్నర లక్షల క్యూసెక్కుల వరకు ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. శుక్రవారం ప్రకాశం బ్యారేజీని కలెక్టర్ పరిశీలించారు.
వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసి నది పరివాహక ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. విజయవాడ కృష్ణలంక, భూపేష్ నగర్ వంటి ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సహాయ శిబిరాలకు తరలించాం. ప్రజలు నదిలోకి దిగడం, పశువులను నీళ్లలోకి వదలటం వంటివి చేయొద్దు. మరో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించాం. జిల్లాలో కలెక్టరేట్‌తో పాటు సబ్ కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశాం. వరద ప్రభావిత మండలాల్లో కూడా కంట్రోల్ రూమ్‌లు నిర్వహిస్తున్నాం- ఇంతియాజ్, జిల్లా కలెక్టర్