inister Gudiwada Amarnath : విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. భారత రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్).. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమో, అనుకూలమో చెప్పాలని అన్నారు. వ్యతిరేకమైతే బిడ్డింగ్‌లో ఎలా పాల్గొంటున్నారని ప్రశ్నించారు. ఏడాదిన్నర క్రితం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన మెమోరాండంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం లేదని స్పష్టం చేసిందని మంత్రి వెల్లడించారు. కేంద్ర ఆర్థిక శాఖ 2022 ఏప్రిల్ 19న జనరల్ పాలసీని విడుదల చేసిందని.. దాని ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు, కో ఆపరేటిన్ సొసైటీ సంస్థలు పాల్గొనే అవకాశం లేదని స్పష్టం చేసింది అని మంత్రి తెలిపారు. అసలు భారత రాష్ట్ర సమితి పార్టీ వైఖరి ఏమిటో తెలంగాణ అధికారులు లేదా అక్కడి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలనేది తమ ప్రభుత్వ విధానమని అన్నారు. ప్రైవేటీకరణకు తాము కూడా వ్యతిరేకమేనన్నారు. సీఎం జగన్ కూడా ప్రధాన మంత్రికి ఇదే చెప్పారని తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. ఇదే మా నినాదమని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు.
కాగా, కేంద్రం జారీ చేసిన మెమోరాండంపై తెలంగాణ ప్రభుత్వానికి అవగాహన లేదంటారా..? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. బిడ్డింగ్‌లో పాల్గొనే విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదని మంత్రి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాకుండా సింగరేణి సంస్థ తరఫున బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందా అని ప్రశ్నించగా.. సింగరేణి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ అయినందున అవకాశాల్లేవని మంత్రి స్పష్టం చేశారు.