కరోనా ఓ వైపు విజృంభిస్తుంటే.. మలేరియా కేసుల సంఖ్య పెరుగుతోంది. కృష్ణా జిల్లా విజయవాడలోని కొత్త పేటలో ఈనెల 14 న ఒకే రోజు ఐదుగురికి మలేరియా సోకింది. అంతకుముందు కూడా కొత్త పేటలో 12 ఏళ్ల బాలిక మలేరియా బారిన పడింది. సుబ్రమణ్యస్వామి ఆలయం వీధి, మాకినేని వారి వీధి, అడ్డారోడ్డు ప్రాంతాల్లో ఈ కేసులు వెలుగుచూశాయి. నగరపాలక, వైద్యారోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
కొత్త పేట ప్రాంతంలోని చుట్టుపక్కల వీధులన్నింటిలో ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్లను చేపడుతున్నారు. ఒక్క ఫిబ్రవరి నెలలోనే 7 కేసులు నమోదయ్యాయి. మిగతా జనవరిలో రెండు , మార్చిలో ఒకటి , ఏప్రిల్ లో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. తాజాగా మే నెలలో ఇప్పటివరకూ ఆరు కేసులు అధికారికంగా గుర్తించారు. ప్రస్తుతం కరోనా తీవ్రత నేపథ్యంలో మలేరియా కేసుల సంఖ్య పెరిగితే .. ఆసుపత్రులకు రోగులు పెద్ద సంఖ్యలో వెళ్లడం ప్రమాదకరం.
కోవిడ్ ఆసుపత్రుల్లో తప్ప .. మిగతా ప్రైవేటు వైద్యులు జ్వరంతో వచ్చే రోగులను చూసేందుకు చాలావరకూ వెనుకంజ వేస్తున్నారు. కోవిడ్ ప్రధాన లక్షణం కూడా జ్వరమే అయిన కారణంగా.. మలేరియాతో వచ్చిన వారికీ సరైన వైద్య సదుపాయం అందించడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమే. గత ఏడాది వర్షాకాలంలో కృష్ణా జిల్లాలో మలేరియా , డెంగీ కేసులు భారీగా నమోదయ్యాయి.