తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలమట్టం పెరిగింది. ఆగస్టు వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 40 శాతం వర్షపాతం అధికంగా నమోదైంది. సాధారణ వర్షపాతం 592.6 మిల్లీమీటర్లు కాగా ఆగస్టు వరకు 830.5 మిల్లీమీటర్లు నమోదైనట్లు భూగర్భజలశాఖ తెలిపింది. ఫలితంగా రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం కూడా పెరిగింది. నిరుడు ఆగస్టులో సగటు భూగర్భ జలమట్టం 11.15 మీటర్లు కాగా ఈ ఏడాది ఆగస్టులో సగటు 6.35 మీటర్లు. అంటే గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే 4.80మీటర్లు పెరిగాయి.
మేతో పొలిస్తే రాష్ట్రంలో భూగర్భ జలాలు 4.93 మీటర్ల మేర పెరిగాయి. జులై నెలతో పోలిస్తే 2.91 మీటర్లు పెరిగాయి. 33 జిల్లాల్లోనూ భూగర్భజలమట్టం పెరిగింది. ఐదు మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉన్న విస్తీర్ణం రాష్ట్రంలో 49 శాతం వరకు ఉంది. 5 నుంచి పది మీటర్ల వరకు 29 శాతం, పది నుంచి 15 మీటర్ల వరకు 14 శాతం విస్తీర్ణంలో భూగర్భజలాలు ఉన్నాయి. కేవలం 8 శాతం విస్తీర్ణం మాత్రమే 15 మీటర్లు, ఆ పైన లోతులో భూగర్భజలాలు ఉన్నట్లు భూగర్భజలశాఖ పేర్కొంది.