అనంతపురంలో పారిశుద్ధ్య కార్మికులకు ప్రైవేట్ బస్సుల యజమానులు అల్పాహారం పొట్లాలు అందించారు. లాక్‌డౌన్ కొనసాగినన్ని రోజులూ కొనసాగిస్తామని తెలిపారు. కడప జిల్లా ఎర్రగుంట్ల 8వ వార్డులో మన ఉరి కోసం ట్రస్ట్ ప్రతినిధులు.. కూలీలకు కూరగాయలు పంపిణీ చేసింది. అనంతపురానికి చెందిన దేవదర్శన్.. సైకిల్ కొనుక్కునేందుకు ముంతల్లో పోగుచేసిన నగదును కరోనా సహాయక చర్యల కోసం కలెక్టర్‌కు అందజేశాడు. ప్రభుత్వం అనుమతిస్తే అన్నక్యాంటీన్లలో పేదలకు భోజనం పెడతామని నరసరావుపేట తెదేపా ఇంచార్జీ చదలవాడ అరవింద బాబు ముందుకు వచ్చారు. తన సొంత ఖర్చులతో పేదలకు భోజనం పెడతామన్నారు.
ప్రకాశంజిల్లా చీరాలలో రెడ్ క్రాస్ సభ్యులు.. రోడ్డుపైనే బతుకీడుస్తున్నవారికి ఆహార పొట్లాలు పంచారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఐఆర్సీటీసీ అమృత హస్తం స్వచ్ఛంద సంస్థతో కలిసి విజయవాడలో పేదలకు ఆహారం అందించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని.. ఎనికేపాడులో ఆటో డ్రైవర్లకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు. జగ్గయ్యపేట పట్టణ శివారు తొర్రగుంటపాలెంలోని మారుతీ యూత్ గ్రామంలోనూ పట్టణ శివార్లలోనూ కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలను గోడలపై చిత్రాలు, రాతలతో ప్రచారం చేశారు.