No Facilities in Gollapudi:విజయవాడకు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ తాగునీటి, పారిశుద్ధ్య సమస్యలతో గొల్లపూడి నివాసితులు కంటతడి పెడుతున్నారు. గొల్లపూడి మేజర్ గ్రామ పంచాయతీ రోజూ ఎదుర్కొంటున్న సమస్యలకేదీ పూచీ అంటూ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తున్నారు. ఏపీ రాజధానిలో కీలకం, విజయవాడ ప్రాశస్త్యానికి నిలయం, సమీపంలో బహిర్గత రహదారి వలయం, ప్రభుత్వ కార్యాలయాలకు కేంద్రంగా ఉన్న గొల్లపూడిలో కనీస పౌర సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం ఏర్పడ్డ గొల్లపూడిలో ఇప్పటికీ ప్రజలకి తాగునీరు, మురుగు కాల్వల సౌకర్యంలేక అవస్థలు పడుతుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కనుచూపుమేరలో ఉండే కృష్ణమ్మ నీరు తాగే భాగ్యంలేదా అని గొల్లపూడి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. తాగునీరు, మురుగుకాల్వల సౌకర్యాలు లేక పడుతున్న కష్టాలపై రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక దృష్టి పెట్టి తక్షణం పరిష్కారాలు చూపాలని గొల్లపూడి ప్రజలు విన్నవిస్తున్నారు.
నీటిని కొనుక్కోవాల్సిన దుస్థితి..: భూగర్భ జలాలు కాలుష్యం కావడంతో వ్యక్తిగత బోర్లు వేసుకున్నా ఫలితం లేదని చెబుతున్నారు. వంటలకు సహా డబ్బులు పెట్టి నీటిని కొనుకోవాల్సిన పరిస్థితి గొల్లపూడి వాసులకు ఏర్పడిందంటున్నారు. మరోవైపు మురుగు కాల్వల సౌకర్యం అరకొరగా ఉండడంతో పారిశుద్ధ్య సమస్యతో రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలు గడుస్తున్నా మౌలిక వసతులు కల్పించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కృష్ణా నది పక్కనున్నా గొంతెండుతోంది..: ఏళ్లు గడుస్తున్నా గొల్లపూడి ప్రజలను పట్టిపీడిస్తున్న నీటి కష్టాలు తీరడం లేదు. కృష్ణా నదికి మూడు కిలోమీటర్ల దూరంలో నివాసముంటున్న గొల్లపూడి వాసులకి తాగునీరు అందకపోవడంతో అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయని వ్యక్తిగత బోర్ల నీరు తాగే పరిస్థితిలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా ఫలితం ఉండటం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.