ఇటీవల కృష్ణాజిల్లా చింతపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో వెలుగుచూసిన.. అధ్వానంగా ఉన్న భోజనంపై విచారణ కొనసాగుతుండగా.. ఇతర విద్యాలయాల్లోనూ అదే తీరుగా కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
మారిన మెనూ ఏదీ?
జిల్లాలో 3063 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలవుతుండగా.. 2,54,048 మంది విద్యార్థులు భోజనం చేస్తున్నారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి పాఠశాల భోజనం నాసిరకంగా ఉంటుందని సగానికి పైగానే ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు. ప్రతి పాఠశాలలోనూ మధ్యాహ్న భోజన సమయంలో ఈ దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా రూపొందించిన నూతన మెనూ అనేక పాఠశాలల్లో అమలుకావడం లేదు. జిల్లా వ్యాప్తంగా 30 శాతం పాఠశాలల్లో పాత పద్ధతిలోనే కొనసాగిస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. కనీసం మెనూపై అవగాహన కోసం ఏజెన్సీలకు ఇంతవరకు శిక్షణ ఇవ్వలేదు. పాఠశాలల ఉపాధ్యాయులకు సమాచారం అందించి అధికారులు చేతులు దులుపుకొన్నారు. కొన్నిచోట్ల నూతన మెనూ కచ్చితంగా అమలు చేయాలని ఉపాధ్యాయులు చెబుతున్నా ఏజెన్సీలు అమలు చేయడం లేదు. మరికొందరు ఏదో నామమాత్రంగా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పర్యవేక్షణ బాధ్యత ఉపాధ్యాయులదేనా?
మధ్యాహ్న భోజన పథక అమల్లో ప్రధాన బాధ్యత ఉపాధ్యాయులదే. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఇ-హాజరు మొదలుకొని, అనేక రకాలైన యాప్‌లలో సమాచారాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవడానికే సమయం సరిపోతోంది. పాఠశాలల పర్యవేక్షణతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించాల్సిన సీఆర్పీలు నామమాత్రంగా సందర్శించి వెళ్లిపోతున్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సరైన పర్యవేక్షణ కొరవడింది. నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయ ఉద్యోగులు గ్రామవాలంటీర్లకు అప్పగించి చేతులు దులుపేసుకుంటున్నారు. పర్యవేక్షించాల్సిన వారు పట్టించుకోకుండా ప్రతీదీ తమపైనే నెట్టేస్తున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
కట్టెల పొయ్యిలే దిక్కు..