నివర్ తుపాను కృష్ణా జిల్లా రైతన్నలకు ఆపార నష్టాన్ని మిగిల్చింది. 4 రోజుల పాటు ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో వేలాది హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4.50 లక్షల ఎకరాల్లో సాగుచేస్తే వాటిలో 2.38 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. జిల్లాలలో వాణిజ్య పంటలు ఎక్కువగా పండిస్తారు. వరి, మిరప, పసుపు, కంద, మినుము, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే పలుసార్లు వచ్చిన తుపానుతో ఈ సారి పంటల ఎదుగుదల అంతంత మాత్రంగానే ఉంది. కనీసం పెట్టుబడులైనా తిరిగి వస్తే చాలనుకున్న రైతన్నలకు పంటచేతికొచ్చే సమయంలో వచ్చిన తుపాను కన్నీటినే మిగిల్చింది. జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమయ్యాయి. నెలరోజుల్లో ధాన్యం ఇంట్లో ఉండేది. ఈ సమయంలో ఈదులుగాలులతో వచ్చిన తుపాను వరి పంట నడుం విరిచింది. దీంతో వేలాది ఎకరాలు నేల మట్టమైంది. ఇప్పటికీ వేల ఎకరాలు నీటి ముంపులోనే ఉన్నాయి.కౌలుకు తీసుకుని ఎకరాకు 40 వేల వరకు పెట్టుబడి పెట్టామని.. ఈ సారి పెట్టుబడి పోగా.. కౌలు ఇచ్చే పరిస్థితి కూడా లేదంటున్నారు. అందిన కాడికి అప్పులు తెచ్చి పంటలుపండిస్తే తీరా చేతికొచ్చే సమయానికి తుపాను కొంప ముంచిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మెులకెత్తిన ధాన్యం
జిల్లాల పలు నియోజక వర్గాల్లో పంటలను ఇప్పటికే కోశారు. రహదారులపై ధాన్యాన్ని ఆరబెట్టిన సమయంలో వచ్చిన తుపాను నిండా ముంచేసింది. నాలుగు రోజుల పాటు ఏకధాటిన కురిసిన వర్షంతో కుప్పగా పోసిన ధాన్యమంతా మొలకెత్తింది. ధాన్యం రంగు మారిపోయింది. నాలుగు రోజుల్లో ధాన్యం అమ్ముడు పోయి కష్టాలు తీరేవని.. ఈ సమయంలో వచ్చిన తుపాను తమను కష్టాల పాలుచేసిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి తమకు న్యయం చేయాలని రైతులు కోరుతున్నారు..
నూర్పిడికి అధిక ఖర్చులు