ఆసక్తికరమైన విభిన్న కళల్లో ప్రతిభ చూపుతున్నాడు విజయవాడకు చెందిన ఇమ్మానియల్. అభిరుచి, ఆసక్తే పెట్టుబడిగా...విభిన్న రంగాల్లో రాణిస్తున్నాడు. చిత్రకళ మెుదలు క్రాఫ్టింగ్, క్లే ఆర్ట్, మైమ్, మోడలింగ్ వంటి వైవిధ్య కళల్లో తనదైన ముద్రతో ముందుకు సాగుతున్నాడు. పెయింటింగ్, రంగోలి చిత్రాల్ని అద్భుతంగా వేస్తున్నాడు.
ఇమ్మానియల్ స్వస్థలం విజయవాడ రాణిగారితోట. తండ్రి రోజు కూలీ. తల్లి ఇంటి దగ్గరే చిన్నకొట్టు చూసుకుంటుంది. అద్దె ఇంట్లోనే జీవనం సాగిస్తున్నారు. పేదరికంతో అవస్థలు పడుతున్నా.. ఇమ్మానియల్ చదువు, విభిన్న కళల్లో చక్కని ఏకాగ్రత చూపుతున్నాడు. కొత్త విషయాల్లో నేర్చుకోవటంలో ఆసక్తే అతడిని ఆల్‌రౌండర్‌గా నిలిపింది.
చిన్నతనం నుంచే తన భావాల్ని అందమైన రంగుల బొమ్మల్లో పలికించేవాడు ఇమ్మానియల్. ఆ సృజనే మట్టి బొమ్మల తయారీ వైపు అడుగులు వేసేలా చేసింది. క్లే ఆర్ట్‌పై పట్టు సాధించేలా చేసింది. కళాశాల నుంచి యూనివర్శిటీ స్థాయిలో పలు బహుమతులు అందుకునే స్థాయికి చేర్చింది.
కళలన్నింటికీ మూలం... మైమ్. అరుదైన ఆ కళలో ఇమ్మానియల్ చక్కని హావభావాలు పలికిస్తున్నాడు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పారాలింపిక్స్‌పై నాటకం ప్రదర్శించి...ప్రథమ స్థానంలో నిలిచాడు. కళాభిమానుల చేత ఔరా అనిపించుకున్నాడు.