పొలాల మెరక పేరుతో కృష్ణాజిల్లా నూజివీడు మండలం మీర్జాపురం వెంకన్న చెరువు పూడిక మట్టి తరలింపునకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల నుంచి నలుగురు అనుమతులు పొందారు. కానీ మట్టిని అధికార పార్టీ నాయకుడి అనుచరుడు నిర్మిస్తున్న గోదాంకి తరలిస్తున్నారు. ఎవరైనా పరిశీలనకు వస్తారని మట్టిని ఎప్పటికప్పుడు చదును చేస్తున్నారు.
- రావిచర్లలో కొండగట్ల గ్రావెల్ కొన్నేళ్ల పాటు తవ్వుకునేందుకు పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చింది. వారు పచ్చని చెట్లను సైతం నేల మట్టం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. తవ్వకాల వద్ద కొలతలు చూస్తే తీసుకున్న అనుమతికీ, తరలించిన గ్రావెల్‌కు పొంతన లేదన్నది బహిరంగ రహస్యం.
- ఇళ్లు, ప్రభుత్వ స్థలాల మెరక కోసమని నియోజకవర్గ ముఖ్యనేత, అతని తనయుడు పేరు చెప్పి తుక్కులూరు, మరికొన్ని ప్రాంతాల్లో కొందరు అధికార పార్టీ నాయకులు గట్లు, గుట్టలను తవ్వేస్తున్నారు. ఇటీవల నూజివీడు తహసీల్దార్ సురేష్‌కుమార్ ఒకరిద్దరికి జరిమానా విధించి మిన్నకున్నారు.
- ముసునూరు మండలం బలివే, ఎల్లాపురం గ్రామాల్లో కొంతమంది అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు తమ్మిలేరు ఇసుక కాసులు కురిపిస్తోంది. అడపాదడపా అధికారులు చేస్తున్న దాడులకు భయపడటం లేదు. ఒక వేళ పట్టుపడినా.. పెద్ద నాయకులతో ఫోన్లు చేయించి తమ పని తాము చేసుకుంటున్నారు.
- ఆగిరిపల్లి మండలం అమ్మవారిగూడెంలో కొండను అనధికారికంగా తవ్వేస్తున్నారు. వడ్లమానులోని ఇళ్ల స్థలాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై నూజివీడు తహసీల్దార్ సురేష్‌కుమార్‌ను సంప్రదించగా మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాల గురించి విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ఒక చోటుకి అనుమతులు తీసుకుని మరో చోటికి మట్టి తరలుతున్న విషయంపై విచారించి నివేదిక ఇవ్వాలని, డీటీ, ఆర్‌ఐలను ఆదేశించానని తెలిపారు. నీటిపారుదల శాఖ ఏఈ సీహెచ్.అవినాష్ మాట్లాడుతూ పొలాల మెరక కోసం మీర్జాపురం వెంకన్న చెరువు మట్టి తరలించుకునేందుకు అనుమతి ఉందన్నారు. మరో చోటుకు మట్టి తరలించకూడదని, తహసీల్దార్ నా దృష్టికి విషయం తీసుకొచ్చారని తెలిపారు. పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతానని చెప్పారు.
ఇదీ చదవండి:
అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత