Illegal sand smuggling: ఏపీలో ఇసుక ప్రియం.. అపురూపం.. భవన నిర్మాణ కార్యక్రమాలకు ఆయువుపట్టు.. ఇసుక స్వరాష్ట్రం ఏపీలో లభ్యం కాదు.. కృష్ణానది నుంచీ యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా అధికార యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తుండటంతో.. మన రాష్ట్ర నదులలో లభించే ఇసుక మాత్రం పొరుగు రాష్ట్రాలకు విస్తృతంగా ఎగుమతి కావడంతో భవన నిర్మాణ కార్మికుల పొట్టగొడుతున్నట్లవుతోంది. పశ్చిమకృష్ణాలో నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల నుంచి పొరుగు రాష్ట్రమైన తెలంగాణాకు మున్నేరు, కృష్ణా నది నుంచి భారీ ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా సంబంధిత శాఖల అధికార్లు ఆక్రమార్కులకు సహకరించడంలో మతలబు ఏమిటో అర్థంకాక ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఒకపక్క కృష్ణానదిలో యథేచ్ఛగా ఇసుక తవ్వి వందల లారీల్లో పక్క రాష్ట్రానికి తరలిస్తుంటే భూగర్భ జలాలు అడుగంటి సమీప బోర్లు పని చేయడం లేదని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
ఏపీలో ఇసుక బంగారం..: భవన నిర్మాణానికి ప్రధాన ముడి సరుకు ఇసుక.. ఏపీలో నాలుగేళ్లుగా ఇసుక లభించక ప్రయివేటు, ప్రభుత్వ నిర్మాణాలు చాలా పరిమితంగానే జరగటంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి మృగ్యమయింది. ఇసుక అక్రమ రవాణాను నిరోధించాల్సిన రాష్ట్ర పోలీసు, రెవెన్యూ, ఎస్‌ఇబీ, రవాణా శాఖ అధికారులు తీరు విగ్రహపుష్టి నైవేద్యంనష్టిలా తయారైంది. పశ్చిమకృష్ణాలో నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల నుంచి మున్నేరు, కృష్ణా నది నుంచి భారీగా ఇసుక అక్రమరవాణా జరుగుతోంది.
తెలంగాణాకు తరలింపు..: కృష్ణానది నుంచీ తవ్విన ఇసుకను ప్రతిరోజు తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్, ఖమ్మం ప్రాంతాలకు 250 నుంచి 300 లారీల్లో నింపి అక్రమంగా తరలిస్తున్నారు. రాజమార్గాల్లోనే రాష్ట్ర సరిహద్దులు దాటుతున్న ఇసుక లారీల గురించి పోలీసు, రెవెన్యూ, ఎస్‌ఇబీ, రవాణా శాఖ అధికారులు పట్టించుకోవట్లేదు. సామాన్యుడికి మాత్రం ఇసుక దొరకటం కష్టంగా ఉండగా.. అక్రమార్కులు మాత్రం లారీలకు లారీలు తరలించేస్తున్నారు. అక్రమంగా వెళ్తున్న లారీలను ఎవరైనా పట్టుకుని పోలీసులకు అప్పగించినా గంటల వ్యవధిలోనే విడిపించి పంపించేస్తున్నారు.
యంత్రాలతో ఇసుక తవ్వకం..: ఇసుక గుత్తేదారు సంస్థ సబ్‌లీజుదారులు ఇష్టానుసారం నది గర్భంలో యంత్రాలతో ఇసుక తవ్వి తరలిస్తున్నారు. నందిగామ మండలంలో మాగల్లు, కంచల, చందర్లపాడు మండలంలోని కాసరబాద, కంచికచర్ల మండలంలోని గనిఆత్కూరు, వత్సవాయి మండలంలో కన్నెవీడు, మల్కాపురం, జగ్గయ్యపేట మండలంలో రావిరాల, అనుమంచిపల్లి గ్రామాల పరిధిలో ఇసుక తవ్వకాలు అడ్డూఅదుపు లేకుండా యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఆయా క్వారీల వద్ద అధికారుల పర్యవేక్షణ కరువైంది. దీంతో ఇసుక అక్రమ తవ్వకం, రవాణాదారులు ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు.