రాష్ట్ర వాప్తంగా అక్రమ మద్యం రవాణాను నిరోధించడానికి అధికారులు ఒక ప్రక్కన ఎంత కష్టపడుతున్నా.... మరో వైపు ఆంధ్రా- తెలంగాణ సరిహద్దుల్లోని గ్రామాల్లో మద్యం అమ్మకాలు మాత్రం అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఆంధ్రా సరిహద్దులలో ఉన్న తెలంగాణ గ్రామాలైన గంగినేని సరిహద్దులోని కొత్తపాలెం, అనంతవరం సరిహద్దులోని గట్ల గౌరవరం, మొర్సుమిల్లి సరిహద్దులోని రాజుపాలెం, కాసవరం గ్రామాల్లో ఏకంగా ఇళ్లలోనే మద్యం అమ్ముతున్నారు గ్రామస్తులు. గతంలో తమ గ్రామాల్లో మద్యం అమ్మడానికి వీల్లేదని నిరసనలు చేపట్టిన గ్రామస్తులే తెలంగాణ ఎక్సైజ్ శాఖ చూసీ చూడనట్లు వ్యవహరించడంతో తెలంగాణ మద్యాన్ని ఆంధ్రా మందుబాబులకు విక్రయిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఆర్ధికంగా దెబ్బ తినటంతో తమ కుటుంబాల పోషణకు ఈ వృత్తిని జీవనోపాధిగా ఎంచుకోక తప్పడంలేదని వాపోతున్నారు.
వ్యవసాయాధారిత గ్రామాల్లో వ్యవసాయం చేస్తూ పంటలను పండించాల్సిన రైతు వారీ కుటుంబాలు కూడా మద్యం అమ్మకాలు చేపట్టి ఇళ్లలోనే దుకాణాలు నిర్వహిస్తూ పెడత్రోవ పడుతున్నారు. గతంలో మద్యం అమ్మకాలను వ్యతిరేకించిన గ్రామస్తులే అమ్మకాలకు తెగబడటంతో పలు గ్రామాల్లో గ్రామస్తులకు,గొలుసు మద్యం దుకాణ వ్యాపారస్తులకు మద్య పోటీ పెరిగి వివాదాలు జరుగుతున్నాయి. గతంలో తెదేపా నాయకులు,మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఈ విషయంపై ధ్వజమెత్తగా... మైలవరం ఎమ్మల్యే వసంత కృష్ణ ప్రసాదు సరిహద్దుల్లోని గ్రామాల్లో గొలుసు దుకాణాల కట్టడికి అధికారులకు సూచనలిచ్చిచారు.