కృష్ణా జిల్లాలో జగనన్న కాలనీల అభివృద్ధి మాటున భారీగా గ్రావెల్ దందా సాగుతోంది. కొంతమంది ప్రజాప్రతినిధుల అండదండలతో వారి అనుచరులే కొండలు, గుట్టలు కరిగించేస్తున్నారు. జగనన్న కాలనీలు మెరక చేసినట్లు ఎక్కడా కనిపించనప్పటికీ.. లక్షల ఘనపు మీటర్ల గ్రావెల్, ఎర్రమట్టి మాయమవుతోంది. దీనికి గన్నవరంలోని కొండపోరంబోకు స్థలాలే సాక్ష్యాలుగా నిలిచాయి. గతేడాది గన్నవరం, ఆగిరిపల్లి మండలాల్లో 20 వరకు క్వారీలు గ్రావెల్ లీజులు తీసుకున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకే మంజూరు చేశారు.
ఒక్కో క్వారీలో 50వేల ఘనపు మీటర్ల వరకు మాత్రమే అనుమతి ఉండగా.. అంతకు పదిరెట్లు ఎక్కువగా మట్టి తరలించేసిన దాఖలాలు ఉన్నాయి. పోలవరం కట్టలపైనా 5వేల క్యూబిక్ మీటర్ల మట్టి తరలించేందుకు అనుమతులు ఇవ్వడం విశేషం. ఇక్కడ లక్ష ఘనపు మీటర్లకు పైగా తవ్వకాలు జరిపారు.
అనధికారికంగా తవ్వకాలు
ప్రస్తుతం గోపవరపుగూడెం, ఆగిరిపల్లి మండలంలోని కనసానపల్లిలో రెండు ప్రాంతాలకే అనుమతులు ఉండగా పలుచోట్ల అనధికారికంగా తవ్వకాలు జరుపుతున్నారు. విజయవాడ బైపాస్ రోడ్డు నిర్మాణ సంస్థకు గన్నవరం మండలం కొండపావులూరులో లీజు కేటాయించారు. రహదారికి 25 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి కావాల్సి ఉండగా.. స్థానిక నేతలు సబ్ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. కొంత మట్టిని రహదారికి, మిగిలింది ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గన్నవరంలో కొండలమీద తవ్వకాలు జరుపుతున్నారు. గన్నవరం మండలానికి చెందిన ఓ నేత అనుచరులే ఇష్టానుసారం తవ్వకాలు చేపట్టినట్లు సమాచారం.