సెప్టెంబరు నెల పింఛన్ల పంపిణీలో ‘ఒక బియ్యం కార్డుకు ఒకే పింఛను’ విధానాన్ని అధికారులు అమలు చేశారు. ఒక కుటుంబంలో రెండు పింఛన్లు తీసుకుంటుంటే వారిలో ఒకరి పింఛనును నిలిపేశారు. అలాగే ఈకేవైసీ చేయించుకోని వారివీ ఆపేశారు. విజయవాడ నగర, గ్రామీణ సచివాలయాల పరిధిలోని కొందరు లబ్ధిదారులను గురువారం ‘ఈనాడు’ కలిసి వివరాలు సేకరించింది. ఈ మేరకు అజిత్‌సింగ్‌నగర్‌లోని 260, 261.. పాయకాపురంలోని 268, 269వ వార్డు సచివాలయాలను, నున్న మండల పరిధిలోని 1, 2, 3తోపాటు పాతపాడు గ్రామ సచివాలయాల్లో తొలగించిన పింఛనుదారుల వివరాలు పరిశీలిస్తే ఎక్కువగా ఒక బియ్యం కార్డుపై రెండు పింఛన్లు (ఇద్దరు లబ్ధిదారులు) ఉన్నవి, ఈకేవైసీ చేయించుకోనివే ఉన్నాయి.
ఒక బియ్యం కార్డుపై రెండు పింఛన్లుంటే ఎవరిది తొలగించాలని అడుగుతూ లబ్ధిదారులకు నోటీసులిచ్చారు. వీటికి వచ్చిన సమాధానంగా వచ్చిన ధ్రువీకరణ పత్రాల ఆధారంగా పింఛన్లను తొలగించారు. ఇవి కాకుండా సచివాలయాల ఉద్యోగుల రేషన్ కార్డులను తొలగించిన నేపథ్యంలో ..అందులో ఉన్న లబ్ధిదారులకు పింఛన్లను నిలిపేశారు. మొత్తం మీద ప్రతి సచివాలయంలోనూ 4-10 వరకు పింఛన్లు ఆగిపోయాయి. పింఛన్ల పంపిణీలో పోర్టబులిటీ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పింఛన్లు తీసుకునే అవకాశం లేదని సిబ్బంది వెనక్కి పంపారు.
- లబ్ధిదారుల నుంచి ధ్రువీకరణ అందని కారణంగా పాయకాపురంలో ఒకే బియ్యం కార్డులో పేర్లు ఉన్న ఇద్దరికీ పింఛను మంజూరు కాలేదని అక్కడి అధికారులు తెలిపారు.
- ఒకే బియ్యం కార్డుపై వృద్ధులు, వితంతువులు ఉంటే నున్న గ్రామం రెండవ సచివాలయ పరిధిలో వితంతువులకే పింఛను ఇవ్వాలని లబ్ధిదారులు కోరారు.
- ఈకేవైసీ నిబంధనతో పింఛన్లు నిలిపేసిన వారిలో 85 ఏళ్లు పైబడిన వృద్ధులున్నారు.. ఆధార్ కేంద్రానికి వెళ్లి ఈకేవైసీ వివరాలు సమర్పించాలని వారికి అధికారులు సూచించారు.
ఇద్దరికీ పింఛను నిలిపేశారు..!