ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 9, 2020, 5:23 PM IST

ETV Bharat / state

మూలన పడ్డ ఐమాస్క్​ బస్సులు...ఇబ్బందుల్లో ఉద్యోగులు

కృష్ణా జిల్లాలో కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఐమాస్క్‌ బస్సులు... నిర్వహణ లోపంతో మూలకు చేరాయి. తమకు వేతనాలు అందడం లేదని సిబ్బంది విధులకు గైర్హాజరవుతున్నారు. దీంతో కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఈ వాహనాల వద్దకు వచ్చిన వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

నిర్వహణ లోపంతో మూలన పడ్డ ఐమాస్క్​ బస్సులు
నిర్వహణ లోపంతో మూలన పడ్డ ఐమాస్క్​ బస్సులు

నిర్వహణ లోపంతో మూలన పడ్డ ఐమాస్క్​ బస్సులు

కృష్ణా జిల్లావ్యాప్తంగా సుమారు 25 వరకు ఇంటలిజెంట్‌ మానిటరింగ్‌ అనాలసిస్‌ సర్వీస్‌ క్వారంటైన్‌-ఐమాస్క్‌ పేరిట ప్రత్యేక బస్సులను ఈ ఏడాది జూన్‌ నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. కరోనా వైరస్‌ సామాజికంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో- పాజిటివ్‌ కేసులను గుర్తించేందుకు ఈ బస్సులు మెరుగైన సేవలే అందించాయి. ఒకేసారి ఎక్కువమంది నుంచి నమూనాలు సేకరించేందుకు ఈ బస్సుల్లో తగిన సౌకర్యాలు సమకూర్చారు.

జిల్లావ్యాప్తంగా కరోనా అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ గత మూడు వారాలుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతూ వస్తోంది. కానీ పరీక్షల సంఖ్య తగ్గించిన కారణంగా.. కొత్త పాజిటివ్‌ కేసుల సంఖ్య పరిమితంగా తక్కువగా ఉంటోంది. జిల్లా అంతటా అన్ని ప్రాంతాలకు వచ్చి పరీక్షలు నిర్వహించే ఐమాస్క్‌ బస్సులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. దీంతో కొత్తగా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయిన సంఖ్య తక్కువగానే కనిపిస్తోంది.

బస్సులు నిలిచిపోవడానికి కారణం- ఐమాస్క్‌ బస్సుల్లో పరీక్షలు నిర్వహించే సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడంతో వారు విధులకు హాజరుకావడం లేదు. దీనివల్ల ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. కృష్ణా జిల్లావ్యాప్తంగా 24 ఐమాస్క్‌ బస్సులున్నాయి. ఈ బస్సులన్నీ విజయవాడ నగరంతోపాటు జిల్లాలోని వివిధ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి... అక్కడ ప్రజలకు కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తుండేవి. ఈ బస్సుల్లో మొత్తం 50 బృందాలుగా సిబ్బంది పనిచేసేవారు. ఒక్కో బృందంలో ముగ్గురు సభ్యులు ఉంటారు. మొత్తం 150 మంది సిబ్బంది విధులు నిర్వహించేవారు. వీరందరినీ ప్రభుత్వం ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఐదు నెలల క్రితం తీసుకుంది. చేరినప్పటి నుంచి వీరికి వేతనాలు చెల్లించలేదు. వేతనాల కోసం జిల్లా కలెక్టరు సహా, వైద్యారోగ్యశాఖ అధికారులు అందరినీ అడుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని- తమకు జీతాలు వస్తాయనే ఆశతో ఇంతవరకు పని చేశామని ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో రోడెక్కాల్సి వచ్చిందని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు.


కరోనా కేసులు తగ్గడానికి కారణం అదేనా...!
కరోనా పరీక్షలు నిర్వహించే ఐమాస్క్‌ బస్సులు జిల్లాలో తిరగకపోవడంతో కోవిడ్‌ పరీక్షల సంఖ్య తగ్గిపోయిందనే వాదన వినిపిస్తోంది. రోజుకు మూడు నుంచి ఐదు వేల పరీక్షలు గతంలో నిర్వహించేవారు. ప్రస్తుతం కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారు ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లకు వచ్చి పరీక్షలు నిర్వహించుకోవాల్సి వస్తోంది. గతంలో కేసులు అధికంగా వచ్చే ప్రాంతాలకు ఐమాస్క్‌ బస్సులు వచ్చి పరీక్షలు నిర్వహిస్తుండేవి. ఇప్పుడు బస్సులున్న చోట్లకు బాధితులు వస్తున్నా సిబ్బంది పరీక్షలు చేయడం లేదు.

ఐదారు నెలలుగా అందని జీతాలు...
ఐమాస్క్‌ బస్సుల్లో పనిచేసే సిబ్బందితోపాటు కొత్త ఆసుపత్రిలో కోవిడ్‌ సేవల్లో పాల్గొంటున్న ఎఫ్ఎన్​వో, ఎమ్​ఎన్​వో సిబ్బందికి కూడా గత ఐదారు నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. ఆగస్టులో అత్యవసరంగా కోవిడ్‌ సేవల కోసం జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌ నర్సులు, అనస్తీషియా టెక్నిషియన్లు, ల్యాబ్‌ టెక్నిషియన్లు, నర్సింగ్‌ సిబ్బంది, ఆసుపత్రి శానిటైజేషన్‌ సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు కలిసి వెయ్యి మంది వరకు సిబ్బందిని అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో తీసుకున్నారు. వీరికి కూడా గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు.

ఇదీ చదవండి

సోమశిల హైలెవల్‌ కెనాల్‌ రెండో దశ పనులకు సీఎం శంకుస్థాపన

ABOUT THE AUTHOR

...view details