Higher Education in America: అమెరికాలో ఉన్నత విద్య చదువుకోవాలనే ఆశావహులు ఊపిరి పీల్చుకున్నారు. అమెరికా ప్రభుత్వం భారతీయ కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం పెద్దసంఖ్యలో విద్యార్థి వీసా(ఎఫ్-1) స్లాట్లు విడుదల చేసింది. దిల్లీలోని రాయబార కార్యాలయంతో పాటు ముంబయి, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లలోని అన్ని కాన్సులేట్ల పరిధిలో ఏకకాలంలో అవి విడుదల అయ్యాయి.
ఇంటర్వ్యూ సమయాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ఒక్కసారిగా ప్రయత్నించటంతో సంబంధిత సైట్లు మందగమనంతో సాగాయి. అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు తరగతులను జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రారంభించనున్నాయి. తదనుగుణంగా గత వారంలోనే స్లాట్లు విడుదల కావాల్సి ఉంది.
హెచ్-1బి వీసాల పునరుద్ధరణ డ్రాప్ బాక్స్ వీసాదారులకు అవకాశం ఇవ్వటంతో విద్యార్థుల విషయంలో జాప్యం జరిగినట్లు సమాచారం. గత జులై, ఆగస్టుతో ముగిసిన విద్యా సంవత్సరంలో సుమారు 82వేల మంది భారతీయ విద్యార్థులకు ఎఫ్-1 వీసాలను అమెరికా జారీచేసింది. ఇంత భారీగా వీసాలు జారీచేయటం ఇదే తొలిసారి.
త్వరలో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరంలోనూ ఇదే సరళి కొనసాగవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వీసాల జారీలో జాప్యాన్ని నియంత్రించేందుకు అమెరికా సర్కారు పెద్ద సంఖ్యలో సిబ్బందిని ఎంపికచేసి ఇంటర్వ్యూ అధికారులుగా ఇటీవలే భారత్‌కు పంపింది. కాన్సులేట్ కార్యాలయాల్లో వారు విధుల్లో చేరటంతో శనివారం స్లాట్లు విడుదల చేశారు.