ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లోతట్టు ప్రాంతాల్లో పంపిణీకి ఇళ్ల స్థలాలు సిద్ధం - కృష్ణాజిల్లాలో నీటమునిగిన ప్రాంతాలు

కృష్ణాజిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో ఇళ్లస్థలాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం భూమి సేకరించింది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు ఆ ప్రాంతాల్లోని స్థలాలు పీకల్లోతు మునిగాయి. ఇది చూసిన లబ్ధిదారులు అక్కడ నివాస గృహాలు ఎలా నిర్మించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. తమకు ఆ స్థలాలు వద్దంటూ లబోదిబోమంటున్నారు.

Housing land beneficiaries in krishna district are not interested to take spaces for distribution in  Inland areas
లోతట్టు ప్రాంతాల్లో పంపిణీకి ఇళ్ల స్థలాలు సిద్ధం-వద్దంటున్న లబ్ధిదారులు

By

Published : Oct 30, 2020, 7:16 PM IST

కృష్ణా జిల్లాలో కోట్ల రూపాయలు వెచ్చించి నివేశన స్థలాల కోసం ప్రభుత్వం భూములు కొనుగోలు చేసింది..ఇప్పుడు అక్కడ నివాసయోగ్యం ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది.. ఇటీవల కురిసిన వర్షాలకు పలు లేఅవుట్లు, కొనుగోలు చేసిన భూములు ముంపుకు గురయ్యాయి. ఈ స్థలాలు తమకు వద్దని కొంతమంది లబ్ధిదారులు తిరస్కరిస్తున్నారు. మరి కొంతమంది సంక్షేమ ఫలాల కోసం మౌనంగా ఉంటున్నారు. జిల్లాలో మెట్ట, డెల్టా తేడా లేకుండా ప్రతి నియోజకవర్గంలోనూ ముంపు ప్రాంతాలు ఉన్నాయి. పంపిణీపై ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. న్యాయస్థానంలో వివాదం ఉండటం వల్ల ఎప్పుడు పంపిణీ చేస్తారనేది తేలలేదు. ఎకరా కనిష్ఠంగా రూ.18లక్షలు నుంచి గరిష్ఠంగా రూ.75లక్షల వరకు వెచ్చించి కొనుగోలు చేశారు. ఇంత పెద్దమొత్తం వెచ్చించిన స్థలాలు ముంపు ప్రాంతంలో ఉండటం పట్ల లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

*విజయవాడలో పేదల కోసం ముత్యాలంపాడు గ్రామంలో 86.39 ఎకరాలు సేకరించగా బుడమేరు బ్యాక్‌వాటర్‌తో మునిగిపోయింది. భవిష్యత్తులోనూ ముప్పు ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. మునగపాడు గ్రామంలో 105.84ఎకరాలు, సున్నంపాడులో119.46 ఎకరాలు సేకరించారు. ఇది రైల్వేట్రాక్‌ ఆవల ఉన్నాయి. రైల్వేట్రాక్‌కు అండర్‌పాస్‌ మాత్రమే ఉంది. చిన్న వర్షం వచ్చినా ఇది నీటితో నిండిపోతుంది. ఇక్కడ ఎప్పుడూ మోటార్లు ఏర్పాటు చేసి నీరు తోడే పరిస్థితి. కౌలూరులో 48.46 ఎకరాలు సేకరించారు. బుడమేరు వంతెన దాటాల్సి ఉంటుంది.

*విజయవాడ నగరంలో 93,610 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఇంకా పెరుగుతున్నారు. వీరికి ప్రైవేటు భూమి1264.92 ఎకరాలు ఇప్పటికే సేకరించారు. మెట్ట ప్రాంతాలుగా చెప్పుకొనే జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలలోనూ వాగుల వెంట సేకరించిన స్థలాలు ముంపునకు గురవుతున్నాయి. నందిగామ మండలం చందాపురం 4.95ఎకరాలు మునిగిపోయింది. నల్లవాగు ముంచెత్తింది. రాఘవాపురంలో సేకరించిన 6.05 ఎకరాలు మునిగిపోయింది. ఇక్కడ 269 మందికి స్థలాలు ఇవ్వాలని ప్రణాళిక. అల్లూరు, జుజ్జూరులోలోని నివేశన స్థలాలు ముంచెత్తాయి. వత్సవాయి మండలంలో వేమవరం, భీమవరం, పోలంపల్లి, వత్సవాయిలో జగ్గయ్యపేటలో తిరుమలగిరి, పెనుగంచిప్రోలు పట్టణ శివారులో సేకరించిన స్థలాలు మునిగిపోయాయి. మైలవరం నియోజకవర్గంలో ఎదురువీడు గ్రామంలో సేకరించిన భూములు వరదలో ముంచెత్తాయి.

* నందివాడ గ్రామంలో కుదరవల్లి గ్రామంలో 9 ఎకరాలు సేకరించారు. ఇప్పటి వరకు 27 మందికే ఇచ్చారు. ఇది ముంపు ప్రాంతం కావడంతో తమకు వద్దని లబ్ధిదారులు అంటున్నారు. తుమ్మలపల్లి గ్రామంలో సేకరించిన 1.10 ఎకరాలు, ఇలపర్రు గ్రామంలో సేకరించిన 7 ఎకరాలు నీట మునిగాయి. ఇక్కడ 111 మందికి కేటాయిస్తున్నారు.

*అవనిగడ్డ నియోజకవర్గంలో కరకట్ట లోపల సేకరించిన స్థలంతో పాటు మండలిపురం గ్రామంలో 1.27 ఎకరాలు సేకరించి 52 మందికి ఇచ్చారు. ఇది చెరువు శిఖ భూమి. వర్షం వస్తే చాలు మునకే. అవనిగడ్డ శివారులో తిప్పాపాలెం గ్రామంలో 4.30ఎకరాలు 172 మందికి ఇచ్చారు. ఇది శ్మశానం పక్కనే ఉంది. బాపులపాడు చెరువు భూమినే లేవుట్‌ వేశారు.

మెరక చేస్తాం …

“ లోతట్టు ప్రాంతాల్లో స్థలాలను లెవలింగ్‌ చేయాల్సి ఉంది. వెలగలేరులో మెరక చేస్తే మునక ఉండదు. అవనిగడ్డలో కరకట్ట ఆవలివైపు కావాలని స్థానికులు కోరిక మేరకు ఇవ్వాలని నిర్ణయించాం. నీరుపారుదల ఏర్పాటు చేస్తే వర్షాలకు నీరు చేరదు. సమస్య ఉన్న చోట పరిశీలించి ఆమేరకు చర్యలు తీసుకుంటాం.” -మాధవీలత, జేసీ

ఇవీ చదవండి:

మరో 6 జిల్లాల్లో: ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో అదనంగా 800 చికిత్సలు

ABOUT THE AUTHOR

...view details