కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో తెలుగు ఎంపీలూ ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం భాజపా తరఫున తెలంగాణ నుంచి నలుగురు లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జీవీఎల్ నరసింహారావును కలిపితే ఏపీ నేపథ్యం ఉన్న రాజ్యసభ సభ్యుల సంఖ్య నాలుగుకు చేరుతుంది. మొత్తం 8 మంది ఎంపీలకు గాను ప్రస్తుతం తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డికి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ప్రస్తుతం మిగతా వారూ మంత్రి పదవులపై ఆశలు పెంచుకున్నారు.
తెలుగుదేశం నుంచి వెళ్లి చేరేటప్పుడు తగు ప్రాధాన్యం ఇస్తామని భాజపా అధిష్ఠానం హామీ ఇచ్చిన నేపథ్యంలో కర్నూలు నేత టీజీ వెంకటేష్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే ఆయన ప్రస్తుతం కర్నూలులోనే ఉన్నారు. ఇప్పటివరకూ ఎలాంటి ఫోన్లూ రాలేదని చెప్పారు. సీఎం రమేశ్, సుజనాచౌదరి, జీవీఎల్ నరసింహారావు, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావులు దిల్లీలో ఉన్నారు. ఇందులో కొందరు పార్లమెంటరీ స్థాయీ సంఘాల సమావేశాల్లో హాజరుకావడానికి వస్తే, మరికొందరు వ్యక్తిగత పనులమీద దిల్లీలో ఉంటున్నట్లు చెప్పారు.