Home minister Anitha : తాడేపల్లి అంధబాలిక హత్యోదంతంపై హోం మంత్రి తానేటి వనిత కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఇబ్బందులు కలిగితే ప్రభుత్వం వెంటనే స్పందిస్తోంది అన్నారు. తాడేపల్లి అంధబాలిక హంతకుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అంధ బాలికను గంజాయి మత్తుతో హత్య చేయలేదని, వ్యక్తిగత కక్ష అందుకు కారణమని పేర్కొన్నారు. హత్య ఘటన అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినా... పోలీసులే అతడిని అరెస్టు చేశారని మంత్రి చెప్పుకొచ్చారు. ఇరుగుపొరుగు కావడంతో అంధ బాలిక హత్య జరిగిందని హోం మంత్రి తెలిపారు.
గంజాయి అమ్మకాలపై ఉక్కు పాదం మోపుతున్నాం...ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నట్టు గంజాయి మత్తులో హత్య చేయలేదు.. మద్యం మత్తులో హత్యకు పాల్పడ్డారని వెల్లడించారు. గంజాయి మీద ఉక్కు పాదం మోపుతోన్నా.. ప్రభుత్వం మీద నిందలు వేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ఇలాంటి ఘటనలు జరిగితే.. అప్పటి ప్రభుత్వం నిందితుల పక్షానే నిలబడేవారని ఆరోపించారు. తాడేపల్లి ఘటన లో తాము ఎందుకు రాజీనామా చేయాలని మంత్రి వనిత ప్రశ్నించారు. పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి చనిపోతే చంద్రబాబు నాడు సీఎం పదవికి రాజీనామా చేశారా..? అని మంత్రి వ్యాఖ్యలు చేశారు. కందుకూరు, గుంటూరు సంఘటనల్లో 11 మంది చనిపోతే ఎమ్మెల్యే పదవికి చంద్రబాబు రాజీనామా చేశారా..? అని మంత్రి వ్యాఖ్యానించారు.