కనిపించకుండా పోయిన తన భర్త కోటేశ్‌ను కోర్టులో హాజరుపరిచేలా మంగళగిరి పట్టణ పోలీసులను ఆదేశించాలని అభ్యర్థిస్తూ బి.సరోజ అనే మహిళ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ పేరుతో పోలీసులు పిలిపించినప్పటి నుంచి తన భర్త కనిపించకుండా పోయారన్నారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం... గుంటూరు అర్బన్ ఎస్పీని కోర్టుకు హాజరవ్వాల్సిందిగా ఆదేశించింది. తాజాగా జరిగిన విచారణకు ఎస్పీ రామకృష్ణ కోర్టుకు హాజరయ్యారు. ఎస్పీ తరపున అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ...కోటేశ్ ను వెతికేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఆయనపై ఓ కేసు నమోదైనందున తనకు తానుగా ఎక్కడో తలదాచుకొని ఉంటారన్నారు. ఆ వివరణపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.వెంకటరమణతో కూడిన దర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసి... విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేసింది.
గుంటూరు అర్బన్ ఎస్పీ తీరుపై హైకోర్టు ఆగ్రహం - గుంటూరు అర్బన్ ఎస్పీ తాాజా వార్తలు
కనిపించకుండా పోయిన ఓ వ్యక్తిని కనుగొనడంలో విఫలమవ్వడం, దర్యాప్తును సక్రమంగా నిర్వహించకపోవడంపై గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దర్యాప్తుపై ఉన్న ఆసక్తి ...అదృశ్యమైన వ్యక్తిని కనుగొనడంలో పోలీసులకు లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఎస్పీ కోర్టుకు సమర్పించిన ప్రమాణపత్రంలో అవాస్తవాలు పేర్కొన్నారని...పోలీసుల వ్యవహార శైలి, ఎస్పీ అవాస్తవాలతో అఫిడవిట్ దాఖలు చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లేందుకు తమ ఉత్తర్వుల ప్రతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ, న్యాయశాఖ ముఖ్య కార్యదర్శులకు పంపాలని ఆదేశించింది. తదుపరి విచారణకు గుంటూరు రేంజ్ ఐజీ... కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు పిటిషనర్ తీరు పైనా కోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. మీ భర్తను కనుగొనే విషయంలో పోలీసులకు సహకరించరా? అని ప్రశ్నించింది. స్నేహితులు, బంధువులు తదితరుల వివరాలను పోలీసులకు ఇవ్వాలని స్పష్టంచేసింది. కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసి వెతికే బాధ్యతను తమపై వేస్తే సరిపోతుందా ? అని ప్రశ్నించింది.
ఇదీ చదవండి: పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్‌కు... ఎస్బీఐ రుణం..!