విజయవాడలోని బెంజ్‌సర్కిల్ సమీపంలో పైవంతెన ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సమీప కాలనీ ప్రజలు ఇబ్బంది పడకుండా సర్వీసురోడ్డు నిర్మాణానికి స్థలం ఉందో? లేదో తెలపాలని రాష్ట్ర రవాణాశాఖ తరపు ప్రభుత్వ న్యాయవాది(జీపీ) కె. నర్సిరెడ్డికి హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
పైవంతెన(ఫ్టైఓవర్) నిర్మిస్తే చట్ట నిబంధనల ప్రకారం సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. పైఓవర్‌తో ముడిపడి ఉన్న వ్యాజ్యాలపై తుది విచారణను జులై 2కు వాయిదా వేసింది. స్థానిక ప్రజల ఇబ్బందుల్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఎలాంటి అధ్యయనం చేయకుండా రెండో పైవంతెన ఏర్పాటు చేస్తున్నారంటూ.. విజయవాడకు చెందిన వై.బసవేశ్వరరావు గతేడాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనివల్ల సర్వీసు రోడ్డు కుదించుకుపోయి. సమీప కాలనీ వాసులకు ఇబ్బంది కలుగుతుందన్నారు.
పిల్‌తో పాటు మరో రెండు అప్పీళ్లు ధర్మాసనం ముందుకు మంగళవారం విచారణకు వచ్చాయి. ఓ అప్పీల్లో పిటిషనర్ తరపు న్యాయవాది వీఎస్‌ఆర్ ఆంజనేయులు వాదనలు వినిపించారు. సర్వీసురోడ్లు ఏర్పాటు చేయకుండా పైవంతెనలు నిర్మిస్తున్నారన్నారు. సర్వీసు రోడ్డు నిర్మించాలని హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఆదేశాలపై ఎన్‌హెచ్‌ఏఐ అప్పీలు దాఖలు చేసి స్టే తీసుకుందని.. ఆ స్టేను ఎత్తివేయాలని కోరారు.