రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఎండ మాత్రమే ఉండగా.. ఇప్పడు వేడి గాలులూ కూడా తోడయ్యాయి. విజయవాడలో ఉష్ణోగ్రతలు గరిష్ఠస్థాయికి చేరుకుంటున్నాయి. దాదాపు ప్రతీరోజూ 40 డిగ్రీల పైనే నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో.. జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీనికి ఉక్కపోత కూడా తోడవడంతో అల్లాడిపోతున్నారు. ఉదయం పది గంటలు కాగానే ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం వేళల్లో రోడ్లపైకి వచ్చేందుకు జనాలు భయపడుతున్నారు. రహదారులపై రద్దీ గణనీయంగా తగ్గుతోంది. అవసరమైతే తప్ప జనాలు ఇళ్లనుంచి బయటికి రావడం లేదు.
రాష్ట్రంలో సూర్యుడి భగభగలు ... ఉక్కిరిబిక్కిరవుతున్న జనాలు
రాష్ట్రంలో భానుడి భగభగలు పెరుగుతున్నాయి. ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. సూర్యుడి ప్రతాపానికి వడగాలులు తోడవడంతో బయటకు అడుగు పెట్టాలంటేనే జనాలు జంకుతున్నారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి పోవడంతో.. ఉదయం పది దాటగానే ఎండలు ఠారెత్తిస్తున్నాయి.
ఎండల ధాటికి ఆర్టీసీ బస్సులు, ఆటోలు ప్రయాణీకులు లేక బోసిపోతున్నాయి. ఎండల భయంతో వాహనాలు ఎక్కేందుకు ప్రజలు భయపడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు ఎండ వేడిమికి తట్టుకోలేక అవస్తలు పడుతున్నారు. ఎండల ప్రభావం వ్యాపారాల పైనా ప్రభావం చూపుతోంది. రోడ్ల పక్కన తోపుడు బండ్లు, సైకిళ్లు పెట్టుకుని వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులు.. ఎండల వేడికి అల్లాడుతున్నారు. ఎండల వేడిమికి బయటకు తక్కువ మంది వస్తుండటంతో వ్యాపారాలు మందగించాయని...ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో మండుతున్న ఎండలు... కర్నూలులో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు