మహిళలపై లైంగిక దాడి, వ్యభిచార కూపంలోకి దించేందుకు సాగుతున్న దుశ్చర్యలు రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్నాయి. జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసిన 2018 సంవత్సర నివేదికలో అతివల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనల్లో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉంది. ఆ ఏడాది దేశవ్యాప్తంగా అన్ని రకాల నేరాలు కలిపి 31లక్షల 32వేల 954 కేసులు నమోదు కాగా... వాటిలో లక్షా 26వేల 635 కేసులు ఏపీలోనే నమోదయ్యాయి.
వ్యభిచారంలోకి దించేందుకు సాగుతున్న మానవ అక్రమరవాణాలో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. అత్యధికంగా మహారాష్ట్ర నుంచి మహిళల అక్రమ రవాణా సాగుతుండగా తర్వాత ఏపీ నుంచే ఎక్కువ మందిని తరలిస్తున్నారు. మహిళలు, వృద్ధులు, ఎస్సీలు, ఎస్టీలపై నేరాల్లో ఆర్థిక, సైబర్ నేరాల్లో, మానవ అక్రమ రవాణా కేసుల్లోనూ ఏపీ మొదటి పది స్థానాల్లోనే ఉంది.