Film producer Chalasani Ashwini dutt: గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూసమీకరణ కింద భూములిచ్చిన వారికి వార్షిక కౌలు ఎందుకు చెల్లించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ తీరుతో పౌరులు ఇబ్బంది పడటానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. భూసమీకరణ చేసిన నేపథ్యంలో భూములిచ్చిన వారికి వార్షిక కౌలు చెల్లించాల్సిన బాధ్యత అధికారులదేనని తేల్చిచెప్పింది. సాంకేతిక కారణాలు చూపుతూ జాప్యం చేయడానికి వీల్లేదంది. ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలని రెవెన్యూశాఖను ఆదేశించింది. విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. సమాధానం సంతృప్తిగా లేకపోతే తగిన ఆదేశాలు ఇస్తామని వ్యాఖ్యానించింది.
విమానాశ్రయ విస్తరణకు తమ నుంచి 39 ఎకరాలు భూసమీకరణ చేశారని, వార్షిక కౌలు చెల్లించడం లేదని ప్రముఖ సినీ నిర్మాత చలసాని అశ్వనీదత్, ఆయన సతీమణి వినయకుమారి వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల నుంచి వార్షిక కౌలు చెల్లించడం లేదని పిటీషనర్ న్యాయవాది శరత్ చంద్ర వాదనలు వినిపించారు.