పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్ట్ ఒప్పందం రద్దుపై స్టే ఎత్తివేత తగదని హైకోర్టు స్పష్టం చేసింది. ఒప్పందం రద్దు ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ఆదేశించింది. పీహెచ్ఈపీ పనులు మరొకరికి అప్పగించే ప్రక్రియ చేపట్టవద్దన్న సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు అమల్లోకి వచ్చేలా ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. నవయుగ వ్యాజ్యంపై తుది విచారణ జరపాలని సింగిల్ జడ్జికి సూచించింది.
జోక్యం చేసుకోవచ్చు
నవయుగ సంస్థ దాఖలు చేసిన అప్పీల్‌పై అనుమతి వివాదం తలెత్తినప్పుడు మధ్యవర్తిత్వ విధానం అనుసరించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇరు పార్టీల మధ్య ఒప్పంద నిబంధన ఉన్నప్పటికీ... అన్యాయం జరిగినప్పుడు, చట్ట నిబంధనలను ఉల్లంఘించిన సందర్భంలో ఉన్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని వ్యాఖ్యానించింది. పీహెచ్ఈపీ విషయంలో ఏపీజెన్‌కో, నవయుగ మధ్య జరిగిన ఒప్పందంలో వివాదం తలెత్తితే మధ్యవర్తిత్వ విధానం అనుసరించాలనే నిబంధన ఉన్నా... హైకోర్టును ఆశ్రయించడంపై నిషేధం లేదని అభిప్రాయపడింది. నవయుగతో ఒప్పందం రద్దు విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించినప్పుడు... హక్కుల పరిరక్షణ కోసం ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది.