ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కాలువలను పూడ్చినవాళ్లు'.. అటవీ భూమిని ఆక్రమించలేదా..?: హైకోర్టు - kondapally issue

కొండపల్లి అభయారణ్యంలో అక్రమ మైనింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటల్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. పంట కాలువను పూడ్చేసి.. రహదారి, స్టోన్‌ క్రషర్ నిర్మాణాలు చేసిన వారు కొండపల్లి అటవి భూమిలో అక్రమ మైనింగ్‌కు పాల్పడలేదనడం నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యలు చేసింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.

alleged on illegal mining at kondapally
కొండపల్లిలో అక్రమ మైనింగ్

By

Published : Jul 31, 2021, 6:59 AM IST

కొండపల్లి అభయారణ్యంలో అక్రమ మైనింగ్‌

కొండపల్లి అభయారణ్యం (Kondapalli Sanctuary)లో అక్రమ మైనింగ్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పంట కాలువను పూడ్చేసి దానిపై రహదారి, స్టోన్‌ క్రషర్ నిర్మాణాలు చేపట్టినవారు కొండపల్లి అటవీ భూమిని ఆక్రమించి అక్రమ మైనింగ్‌కు పాల్పడలేదంటే ఎలా నమ్మాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని..హైకోర్టు ప్రశ్నించింది. కాలువ మాత్రమే ఆక్రమించారని అటవీ భూమి ఆక్రమణకు గురికాలేదని ప్రభుత్వం చెబుతున్న మాట జీర్ణించుకోవడానికి కష్టంగా ఉందని ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఈ వ్యవహారాన్ని మరోసారి పరిశీలించాలని.. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కాలుష్య నియంత్రణ మండలి, అటవీశాఖ, కృష్ణా జిల్లా కలెక్టర్‌, జలవనరుల శాఖ, గనుల శాఖ ముఖ్యకార్యదర్శులతో పాటు ఆక్రమణ ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 మందికి నోటీసులు జారీచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ ఎన్‌. జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి పిల్

కొండపల్లి అటవీభూమిని ఆక్రమించి అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న పలువురు పరిటాల గ్రామ పరిధిలో 8.6 కిలోమీటర్ల మేర ఇబ్రహీంపట్నం మెయిన్ కాలువను కనమరుగు చేశారని.. దీనిపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో పిల్‌ వేశారు. శుక్రవారం ఈ వ్యాజ్యం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎన్వీ సుమంత్‌ వాదనలు వినిపించారు.

ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ వాదనలు వినిపిస్తూ.. పంట కాలువను పూడ్చి నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవమేనన్నారు. 2018లోనే అధికారులు ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశారన్నారు. అటవీ భూమి ఆక్రమణకు గురికాలేదన్నారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ గనుల తవ్వకం జరిగిన ప్రాంతంలో ఉపగ్రహ చిత్రాన్ని ఇవ్వాలని స్పష్టం చేసింది. నోటీసులు ఇచ్చాక పురోగతి ఏంటని ప్రశ్నించింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన ధర్మాసనం.. విచారణను ఐదు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

Godavari River Management Board: ఆగస్టు 3న సమన్వయ కమిటీ భేటీ

ABOUT THE AUTHOR

...view details