ఏపీఏటీ 'సవరణ' ఉత్తర్వుల జారీ జాప్యంపై హైకోర్టు ఆగ్రహం - apat cancellation news
ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రైబ్యునల్(ఏపీఏటీ)రద్దు వ్యవహారంలో సవరణ ప్రకటన ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. విచారణను మార్చి4 వరకు వాయిదా వేస్తూ... సవరణ ప్రకటన చేయడంలో విఫలమైతే సంబంధిత శాఖ డిప్యూటీ సెక్రటరీ హాజరు కావాలని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రైబ్యునల్ రద్దు వ్యవహారంలో సవరణ ప్రకటన ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇప్పటికే పలుమార్లు వాయిదాలు ఇచ్చామని గుర్తుచేసింది. సవరణ నోటిఫికేషన్ ఇస్తామంటూ వాయిదాలు కోరడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణను మార్చి 4కు వాయిదా వేస్తూ ..ఈలోపు సవరణ ప్రకటన ఇవ్వడంలో విఫలమైతే సంబంధిత శాఖ డిప్యూటీ సెక్రటరీ హాజరు కావాలని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే. మహేశ్వరి , జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఏపీఏటీ రద్దు విషయంలో హైకోర్టు ఆమోదం ఉందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటన జారీచేసింది. మేమెప్పుడు ఆమోదం తెలిపామని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేయటంతో... సవరించిన ప్రకటన జారీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయ సొలిసిటర్ జనరల్ బి.కృష్ణమోహన్ తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన విచారణలో సహాయ సొలిసిటర్ జనరల్ మరోమారు సమయం కోరటంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.